దిగ్విజయ్ సంచలన ఆరోపణలు

February 20, 2017


img

రాష్ట్ర కాంగ్రెస్ అధ్వర్యంలో నిజామాబాద్ లో నిన్న జరిగిన ‘జన ఆవేదన’ బహిరంగ సభకి ముఖ్య అతిధిగా హాజరైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, భాజపా మజ్లీస్ పార్టీలపై సంచలన చాలా ఆరోపణలు చేశారు.

2015లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో భాజపా ప్రత్యర్ధ పార్టీలను ఓడించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి రూ.400 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. మళ్ళీ ఇప్పుడు యూపిలో కూడా అలాగే చేశారని ఆరోపించారు. భాజపా, మజ్లీస్ పార్టీలు పైకి ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆ రెండు పార్టీలు తెర వెనుక చేతులు కలుపుతూ ప్రజలను మోసగిస్తున్నాయని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. 

ఆయన చేసిన ఆరోపణలు నిజమైతే బిహార్ లో భాజపా గెలిచి ఉండాలి కానీ అక్కడ చిత్తుగా ఓడిపోయింది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమే అనుకొన్నా బిహార్ లో ఆ ప్రయోగం వికటించినప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో కూడా మజ్లీస్ పార్టీకి అంత డబ్బు ఎందుకు ముట్టజెప్పుతుంది? అని ఆలోచిస్తే దిగ్విజయ్ సింగ్ ఆరోపణలలో నమ్మశక్యంగా లేవని స్పష్టం అవుతోంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించదలచుకొన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే, ఆ ప్రతిపాదనను భాజపా చాలా గట్టిగా వ్యతిరేకించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఆలోచనను కూడా విరమించుకోవడం గమనిస్తే భాజపా వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. కనుక దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ ఆరోపణలు ప్రజలను తప్పు ద్రోవ పట్టించడానికేనని భావించవచ్చు. 


Related Post