చంద్రబాబుకి కేసీఆర్ సూచన?

February 15, 2017


img

కృష్ణానదీ జలాల పంపకాల కోసం కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ బుదవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినప్పుడు ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఇరుగుపొరుగు రాష్ట్రాలతో నీళ్ళ కోసం గొడవలు పడదలచుకోలేదని, ఏ రాష్ట్రంలోనైనా రైతులకు నష్టం కలుగకుండా ఉండాలన్నదే తమ కోరిక అని చెప్పారు. తమ ప్రభుత్వం ఎగువనున్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకొందని, ఏపితో కూడా సర్దుబాటు చేసుకోవడానికి సముఖంగా ఉన్నామని చెప్పారు. నీళ్ళ కోసం కోర్టుల చుట్టూ తిరిగే కంటే ఇరు రాష్ట్ర ప్రతినిధులు కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కేసీఆర్ చెప్పారు.

ఎగువ రాష్ట్రాలలో బారీగా ప్రాజెక్టులు నిర్మించినందున దిగువనున్న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు రెండూ కూడా నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. కనుక కృష్ణా, గోదావరి నదులలో పుష్కలంగా నీళ్ళు ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు నీటి వినియోగం కోసం రెండు వేర్వేరు ప్లాన్లను రూపొందించవలసిందిగా కేసీఆర్ బజాజ్ కమిటీని కోరారు. సముద్రంలోకి వృదాగా పోతున్న నీటిని ఇరు రాష్ట్రాలు సమర్ధంగా ఉపయోగించుకోవడం మంచిదని అన్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు అందించి ఆ ప్రాంతాలను ఏవిధంగా సస్యశ్యామలంగా చేయవచ్చో తన ఆలోచనలను ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకి ఇదివరకే చెప్పానని కేసీఆర్ అన్నారు. 

కేసీఆర్ బజాజ్ కమిటీతో చెప్పిన ఈ విషయాల గురించి ఏపి సర్కార్ కూడా అలోచించి సానుకూలంగా స్పందించినట్లయితే, నీటి పంపకాల గురించి దశాబ్దాలపాటు రెండు తెలుగు రాష్ట్రాలు గొడవలు పడనవసరం ఉండదు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కనుక, మద్యలో కేంద్రం లేదా కోర్టుల జోక్యం కోరడం కంటే, కేసీఆర్ సూచిస్తున్నట్లు ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యలకు శాశ్విత పరిష్కారం కనుగొనడం వివేకమనిపించుకొంటుంది.  


Related Post