తెరాసతో పొత్తులు లేవు..లేవు...లేవు...

February 03, 2017


img

తెరాస-భాజపాలు తాము పొత్తులు పెట్టుకొంటామని కానీ లేదా అటువంటి ఆలోచన ఉన్నట్లు గానీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆ రెండు పార్టీల తీరు చూసి అవి వచ్చే ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవడం ఖాయమనే అందరూ భావిస్తున్నారు. మీడియాలో వస్తున్న అటువంటి వార్తలు, విశ్లేషణలను మొదట్లో భాజపా ఖండించకపోవడంతో ప్రజలకు కూడా అవి నిజమనే అభిప్రాయం కలుగసాగింది. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఈ బడ్జెట్ సమావేశాలలో బిల్లు ప్రవేశపెడతానని ప్రకటించారో అప్పటి నుంచి భాజపా వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు భాజపా ప్రతీ సమావేశంలో పనిగట్టుకొని “తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం మాకు లేదు..లేదు...లేదూ...” అని గట్టిగా చెపుతోంది.

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి జి. సతీష్ మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో పర్యటించినప్పుడు కూడా భవిష్యత్ లో తెరాసతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం భాజపా అధిష్టానానికి లేదని రాష్ట్ర భాజపా నేతలకి, కార్యకర్తలకి తెలియజేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొన్నంత మాత్రాన్న లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్రమంత్రులు మెచ్చుకొన్నంత మాత్రాన్న తెరాసతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావించరాదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా ఒంటరిగానే పోటీ చేయబోతోందని, కనుక భాజపాను గెలిపించుకొనేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అందుకోసం ఇప్పటి నుంచే అందరూ గట్టిగా ప్రయత్నాలు చేయాలని కోరారు. 

తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం లేదని భాజపా పదేపదే చెప్పుకోవడమే రాష్ట్రంలో అది ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో తెరాసను డ్డీకొని విజయం సాధించగలమనే నమ్మకమే భాజపాలో ఉండి ఉంటే అసలు ఇటువంటి ఆలోచనలకు తావిచ్చి ఉండేదే కాదు. మళ్ళీ ‘తూచ్’ అంటూ ఖండనలు చేసేదే కాదు. అది కూడా కాంగ్రెస్ పార్టీలాగ తెరాస సర్కార్ ను గట్టిగా డ్డీ కొంటూ ఉండేది. 

తమతో పొత్తులు పెట్టుకోమని తెరాస ఎప్పుడూ భాజపాను కోరలేదు. భాజపాయే అర్రులు చాచి భంగపడుతోంది. ఇదివరకు సూర్యాపేటలో భాజపా సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరాసకు స్నేహ హస్తం చాచారు. కానీ తెరాస అధినేత కేసీఆర్ ఆసక్తి చూపలేదు. ఆ తరువాత మిషన్ భగీరథ ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు తెరాస సర్కార్ పాలనను మెచ్చుకోవడం, కేంద్రమంత్రులు కూడా తెరాస సర్కార్ ను ఆకాశానికి ఎత్తేయడం, రాష్ట్రానికి ఉదారంగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తుండటం, అందుకు ప్రతిగా అన్నట్లు నోట్ల రద్దు నిర్ణయాన్ని కేసీఆర్ గట్టిగా సమర్ధించడం వంటి అనేక పరిణామాలన్నీ ఆ రెండు పార్టీలు దగ్గరైనట్లు భావింపజేశాయి. కానీ తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం లేదని భాజపా అధిష్టానం తన రాష్ట్ర నేతలు, కార్యకర్తలకే నచ్చజెప్పుకోవలసివస్తోంది. 

తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం లేదని భాజపా ఎంత గట్టిగా చెప్పుకొంటే దాని బలహీనతను అంత గట్టిగా ప్రజలకు చాటి చెప్పుకొన్నట్లవుతుందని గుర్తించడం మంచిది. ఒకవేళ దానికి నిజంగానే అటువంటి ఆలోచన లేకపోతే, ప్రజా సమస్యలపై తెరాస సర్కార్ తో పోరాడితే సరిపోతుంది. అదే ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపిస్తుంది.


Related Post