ట్రంప్ బాటలో కువైట్..

February 02, 2017


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏడూ ముస్లిం దేశాలపై నిషేధం విదించి యావత్ ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తే, కువైట్ కూడా ఆయన బాటలోనే సాగుతూ 5దేశాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్ మరియు ఇరాన్ దేశాలున్నాయి. ఈ 5 దేశాల ప్రజలు తమ దేశంలో ప్రవేశించేందుకు వీసాల కోసం దరఖాస్తులు చేసుకొనవసరం లేదని ప్రకటించింది. 

ప్రస్తుతానికి పాకిస్తాన్ పై ట్రంప్ ప్రభుత్వం నిషేధం విదించనప్పటికీ, అమెరికా రావాలనుకొంటున్న దాని పౌరులకు వీసాలు జారీ విషయంలో మరింత కటినంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. అవసరమైతే మున్ముందు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. అమెరికా కంటే ముందుగానే కువైట్ పాక్ పై నిషేధం విదించి పెద్ద షాక్ ఇచ్చింది.  

ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ కు ఇది చాలా పెద్ద దెబ్బే అవుతుంది. పాకిస్తాన్ నుంచి ఏటా కొన్ని లక్షల మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు ఉద్యోగాల కోసం  కువైట్ తో సహా గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. కనుక గల్ఫ్ లో ఒక దేశం తలుపులు మూసినట్లయితే, ఇతర దేశాలు కూడా అదే పని చేయవచ్చు. వాటిలో రెండవదేశం యూఏఈ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం వంటి కరడుగట్టిన నేరగాళ్ళ వలన దుబాయ్ ప్రతిష్ట మసకబారుతూనే ఉంది. పైగా ఇటీవల కాలంలో భారత్- యూఏఈ ల మద్య సంబంధాలు చాలా బలపడుతున్నాయి. కనుక భారత్ ను ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ పై యూఏఈ కూడా నిషేధం విధించినా ఆశ్చర్యం లేదు. 

దేశాల మధ్య హద్దులు చెరిగిపోతున్న ఈ ఆధునిక యుగంలో ఇటువంటి విపరీత పోకడలు ఎవరికీ మంచివి కావు. ఒక దేశానికి లేదా మతానికి లేదా జాతికి చెందిన కొందరు వ్యక్తులు లేదా సమూహాలు హానికరంగా మారితే వారు మాత్రమే తమ దేశాలలో చొరబడకుండా అడ్డుకోవాలి కానీ ఏకంగా ఆ దేశ ప్రజలందరూ ఉగ్రవాదులే అన్నట్లు నిషేధించడం సంకుచిత ఆలోచనే అని చెప్పక తప్పదు. 


Related Post