నారాయణ జోస్యం కూడా చెపుతారా?

February 02, 2017


img

వామపక్ష నేతలకు దేవుళ్ళు, పూజలు, జాతకాలపై నమ్మకం లేకపోవచ్చు కానీ అందరూ జోస్యం చెపుతుంటారు. వారిలో సిపిఐ నేత నారాయణ కూడా ఒకరు. బడ్జెట్ పై స్పందిస్తూ, “డోనాల్డ్ ట్రంప్ చర్యలతో కొత్త సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయులకు మోడీ ప్రభుత్వం బడ్జెట్ ద్వారా మేమున్నామనే భరోసా ఇవ్వలేకపోయింది. ఎన్డీయే ప్రభుత్వం రాజకీయంగా విఫలం అయ్యింది. భాజపా మతతత్వ పార్టీగా మిగిలిపోయింది. అది ప్రజలను మతాలవారీగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ చెల్లని నోటుగా మిగిలిపోవడం ఖాయం,” అని నారాయణ అన్నారు. 

ఆయన చెప్పిన జోస్యం ఫలిస్తుందో లేదో తెలియడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆయన వ్యాఖ్యలలో అమెరికా తాజా విధానాల వలన భారత్ కు ఏర్పడిన సమస్యపై మోడీ ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందన్న మాటలు చాలా ఆలోచించదగ్గవే. అమెరికా తాజా నిర్ణయాల వలన ఆ దేశానికి వెళ్ళాలనుకొనే వారికి, అక్కడ ఉన్న ప్రవాస భారతీయులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే అమెరికా నూతన పారిశ్రామిక విధానాల వలన భారత్ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపబోతోందని అర్ధం అవుతోంది. కనుక మోడీ ప్రభుత్వం ముందుగానే మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. కానీ బడ్జెట్ లో అటువంటి ప్రతిపాదనలు ఏమీ లేవు. కనీసం ఆ సమస్యను తమ ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కోవాలనుకొంటోందనే చిన్న ప్రకటన కూడా చేయలేదు.

ట్రంప్ రగిల్చిన హెచ్1-బి వీసాల కార్చిచ్చు సెగలు ఇప్పటికే భారత్ ను తాకుతున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం దానిని ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టబోతోందో..అసలు ఇంతవరకు ఏమైనా చర్యలు చేపట్టిందో లేదో తెలియదు. నోట్ల రద్దు తరువాత కూడా ఇలాగే రోం నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకొంటూ కూర్చొన్నట్లు వ్యవహరించడంతో 125 కోట్ల మంది దేశప్రజలు నానా కష్టాలు పడ్డారు. సాహసం చేసి అంత గొప్ప నిర్ణయం తీసుకొన్నా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ఆశించిన ఫలితం దక్కకపోగా మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయింది. మళ్ళీ ఈ ట్రంప్ రగిల్చిన కార్చిచ్చు కూడా భారత్ ఆర్ధిక వ్యవస్థను దహించివేయక మునుపే మోడీ ప్రభుత్వం మేల్కొని ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపడితే మంచిందని నారాయణ హెచ్చరిస్తున్నట్లుగా భావించవచ్చు. ఒకవేళ ఈ సమస్యను మోడీ ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కోవడంలో విఫలం అయితే నారాయణ జోస్యం ఫలించే అవకాశాలు కూడా ఉండవచ్చు. 


Related Post