వరాలు, వడ్డింపులు లేని బడ్జెట్..పరువాలేదు

February 01, 2017


img

గతంలో కాంగ్రెస్ హయంలో బడ్జెట్ అనగానే వరాల ప్రకటన, ధరలు పెరిగే, తరిగే వస్తువుల జాబితాల గురించి కబుర్లు వినబడేవి. కానీ మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటువంటి ఆడంబరాలు ఏవీ లేవు. పైగా ఈసారి సామాన్య ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపలేదు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగబోతున్నందున ఆ రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకొనేందుకు నిగూడంగా కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం విశేషం. అందుకే ప్రతిపక్షాలు బడ్జెట్ లో లోపాలను ఎత్తి చూపి విమర్శలకే పరిమితం అయ్యాయి తప్ప ఎన్నికల కమీషన్ కు పిర్యాదులు చేయడానికి బయలుదేరలేదు. బహుశః అటువంటి అంశాల కోసం బడ్జెట్ ను జల్లెడపడుతున్నాయేమో? ఏవైనా దొరికితే రేపోమాపో ఎన్నికల కమీషన్ వద్దకు పరుగులు తీయవచ్చు.

ఇక ఈసారి బడ్జెట్ లో ప్రస్పుటంగా కనబడుతున్న సానుకూల అంశాల గురించి చెప్పుకోవాలంటే, రూ.5-10 లక్షల వార్షికాదాయం కలిగిన మద్యతరగతి ప్రజలకు 5 శాతం పన్ను తగ్గించడం, వృద్ధులకు ఆధార ఆధారిత ఆరోగ్య కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటన, వృద్ధులకు 8 శాతం ఇచ్చే ఎల్.ఐ.సి. బాండ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,96,135 కోట్లు కేటాయింపుల వంటివి చెప్పుకోవచ్చు. 

ఇక గ్రామీణ ప్రాంతాలలో కూడా మౌలిక వసతులు కల్పించి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పధకంలో బాగంగా  రోజుకి 132 కిమీ కొత్త రోడ్ల నిర్మాణం, అన్ని గ్రామాలకు విద్యుదీకరణ, మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కానికి రూ.48,000 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.18,723 కోట్లు కేటాయింపుల వలన గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి వేగం పుంజుకోవచ్చు. వ్యవసాయ రుణాల కోసం ఏకంగా రూ. 10 లక్షల కోట్లు కేటాయించడం విశేషమేనని చెప్పవచ్చు. ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.23,000 కోట్లు కేటాయించి, గ్రామజ్యోతి యోజనకు రూ.4,814 కోట్లు, అంత్యోదయకు రూ. 2500 కోట్లు కేటాయించడం వంటివి కూడా గ్రామీణాభ్యుదయానికి చాలా దోహదపడతాయి. అలాగే దేశంలోని 28,000 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందజేయాలనుకోవడం నిజంగా కార్యరూపం దాలిస్తే చాలా మంచి ప్రతిపాదనే అని చెప్పవచ్చు.

అన్నిటి కంటే నిరుపేదలకు కోటి పక్కా ఇళ్ళు నిర్మిస్తామని జైట్లీ ప్రకటించడం హర్షణీయం. కానీ అటువంటి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో కట్టి చూపించినట్లయితే, ఇటువంటి బడ్జెట్ ప్రతిపాదనల పట్ల విశ్వసనీయత ఏర్పడుతుంది. 


Related Post