కేసీఆర్ ఏమీ చేయలేకనే అలా..

January 30, 2017


img

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 3 అడుగులు ముందుకు 6 అడగులు వెనక్కి అన్నట్లు సాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తెరాస సర్కార్ లోపాలను ఎత్తి చూపి గట్టిగా పోరాడుతూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నప్పటికీ, పార్టీ ఫిరాయింపులు, అంతర్గత కుమ్ములాటలు, నేతల మద్య ఆధిపత్యపోరు కారణంగా పార్టీ చాలా బలహీనంగా మారుతోంది. 

రాజ్యసభ సభ్యురాలు, ఖమ్మం జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిని ఆ జిల్లాలో నేతలు, రాష్ట్ర స్థాయి నేతలలో కొందరు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా ఆమె పార్టీలో ఏకాకిగా కనిపిస్తుంటారు. పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడానికి శ్రమిస్తున్న రేణుకా చౌదరి, వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పడం విశేషమే. 

ఆమె ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో తెరాస పాలన, కాంగ్రెస్ భవిష్యత్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ “వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీయే తప్పకుండా గెలువబోతోంది. ఎందుకంటే ఈ రెండున్నరేళ్ళలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదు. ఉన్న నిధులన్నీ దుబారా ఖర్చులు చేసేసి, మళ్ళీ అప్పులు చేసి తెచ్చిన డబ్బును కూడా జేబులో వేసుకొంటున్నారు. బంగారి తెలంగాణా ఆయన కుటుంబానికే వచ్చింది తప్ప ప్రజలకి కాదు. ఇక తమ వల్ల ఏమీ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించబట్టే ప్రజలకు మాయమాటలు చెపుతూ ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు గాబట్టే ఆయన మాయ మాటలు నమ్మి తెరాసకు ఓట్లు వేసి అధికారం అప్పజెప్పి ఇప్పుడు తీరికగా చాలా బాధపడుతున్నారు. ఏ గ్రామంకయినా వెళ్ళి చూడండి..అక్కడ పెన్షన్లు అందక మహిళలు, రుణాలు మాఫీ కాక రైతులు, ఉద్యోగాలు, ఉపాధిలేక యువత తెరాస సర్కార్ ను తిట్టుకొంటున్నారు. మా హయంలో అన్నీ ప్రజల ముంగిళ్ళకే చేరేవి. కానీ తెరాస సర్కార్ వచ్చేక ప్రతీ దానికి ఆన్-లైన్ అంటూ గ్రామీణులను చాలా ఇబ్బందులు పెడుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయం,” అని రేణుకా చౌదరి అన్నారు. 


Related Post