భాజపా కూడా ఏమి తీసిపోలేదు

January 28, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలలో తెరాస, తెదేపాలు గత ఎన్నికలలో పంట రుణాలను మాఫీ చేస్తామని రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత దానిని అమలుచేయలేక అవి పడుతున్న కష్టాలను అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి హామీలు ఇవ్వడం, దాని కోసం కేంద్రప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ సహాయం కోరడం రెండూ తప్పేనని అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ నిష్కర్షగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకి చెప్పారు కూడా. కానీ ఇప్పుడు అదే పొరపాటు చేయడానికి భాజపా సిద్దం అవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఈరోజు భాజపా విడుదల చేసిన యూపి ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడవ హామీగా పంట రుణాల మాఫీ చేస్తామని పేర్కొంది. తెదేపా, తెరాసలు ప్రాంతీయ పార్టీలు కనుక అవి అధికారంలోకి రావడానికి తమ శక్తికి మించిన హామీలను ఇచ్చాయంటే వాటి తాపత్రయాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు దేశ ఆర్ధిక పరిస్థితి, ఆ రాష్ట్ర ఆర్ధికపరిస్థితి గురించి పూర్తి అవగాహన కలిగే ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పైగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలో కెల్లా అతిపెద్ద రాష్ట్రం, అధిక శాతం ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. 

విభజన తరువాత చిన్న రాష్ట్రాలుగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలోనే పంట రుణాల మాఫీ తలకు మించిన భారంగా మారిపోయింది. మరి సువిశాలమైన యూపి రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయడం అసాధ్యమేనని చెప్పవచ్చు. ఈ సంగతి తెలిసీ భాజపా ఈ హామీ ఇచ్చింది అంటే ఏమనుకోవాలి?


Related Post