తెరాస సర్కార్...హోషియార్!

January 28, 2017


img

“మన రాష్ట్రమే అన్ని రంగాలలో నెంబర్: 1 స్థానంలో ఉంది. యావత్ ప్రపంచం మన రాష్ట్రాన్నే చూస్తోంది. మన రాష్ట్రంలో పెద్దపెద్ద ఐటి పరిశ్రమలున్నాయి. 2025కి ఇంత ప్రగతి సాధిస్తాం..2045 అంత ప్రగతి సాధిస్తాం..ప్రపంచంలోనే నెంబర్: 1 గా నిలుస్తాం..2070కి మొత్తం ఈ విశ్వంలో అన్ని గ్రహాలలోకి మన రాష్ట్రమే నెంబర్: 1 అవుతుంది,” అంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకొంటున్న డప్పుతో ప్రజల చెవులలో నుంచి రక్తం కారే పరిస్థితి ఉంది.   

కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఈ తాజా సర్వే నివేదిక చూస్తే అర్ధం అవుతుంది. ఇదేదో దారినపోయే దానయ్య ప్రకటించిన నివేదిక కాదు. కన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియ ఇండస్ట్రీస్ (సిఐఐ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫట్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, పీపుల్ స్ట్రాంగ్, లింక్డిన్, అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ లతో కలిసి వీబాక్స్ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో కనుగొన్న వివరాలు. ప్రతీ ఏటా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ పేరిట ఈ నివేదికను ప్రకటిస్తుంటాయి. 2016 ఫలితాలను ఐ.ఎస్.ఆర్-2017 పేరుతో విడుదల చేశారు. ఆ వివరాలు చూస్తే తెరాస సర్కార్ తక్షణమే తన మేల్కొని యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టవలసి ఉంటుందని అర్ధం అవుతుంది. ఆ ఐ.ఎస్.ఆర్-2017 నివేదికలో వివరాలు:

1. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంతో సహా దేశంలో 11 రంగాలకు చెందిన పరిశ్రమలకు కావలసిన అభ్యర్ధులను అందించే విషయంలో దేశంలో తెలంగాణా మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. 

2. ఈ 11 రకాల పరిశ్రమలలో 8 రకాల పరిశ్రమలకు తగిన అభ్యర్ధులను అందిస్తూ మహారాష్ట్ర దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర  తరువాత ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. దేశంలోని ఐటి సంస్థలకు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు తగిన అభ్యర్ధులను అందిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం, తెలంగాణా 7వ స్థానంలో నిలిచాయి.

3. ఇంటర్న్ షిప్ విషయంలో కూడా తెలంగాణా విద్యార్ధులు చాలా నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో నెంబర్: 1 స్థానంలో రాజస్థాన్, దాని తరువాత స్థానాలలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నిలువగా తెలంగాణాకి 7వ స్థానం దక్కింది. తెలంగాణా విద్యార్ధులు దేశానికి సంబందించిన వివిధ అంశాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడంలో నిరాసక్తి చూపుతున్నట్లు నివేదికలో పేర్కొంది.

4. గణాంకాలు మరియు విశ్లేషనాత్మక నైపుణ్యం (న్యూమరికల్ మరియు క్రిటికల్ థింకింగ్ స్కిల్ల్స్) కలిగి ఉన్న 10

5. రాష్ట్రాల జాబితాలో తెలంగాణా లేదు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరుసగా 7, 8 స్థానాలలో నిలించింది.      

6. ఇంగ్లీష్ బాషపై పట్టులో 4వ స్థానంలో కంప్యూటర్ నాలెడ్జిలో 9వ స్థానంలో తెలంగాణా రాష్ట్రం నిలిచింది. ఈ రెంటిలో ఏపి వరుసగా 7,8 స్థానాలలో నిలిచింది.

7. వివిద రంగాలలో పనిచేస్తున్నవారిలో పురుషులు 40 శాతం ఉండగా, మహిళలు కేవలం 29శాతం మాత్రమే ఉన్నారు. మళ్ళీ వారిలో కూడా 21-25సం.ల వయసున్న మహిళలు వివిధ కారణాల చేత ప్రతీ ఏటా ఉద్యోగాలు మానేస్తున్నారు. 11రంగాలలో పురుషులతో స్త్రీలకూ సమానావకాశాలు ఉన్నప్పటికీ వారి సంఖ్య పెరగడం లేదు. 



Related Post