ఆ పార్టీకి ఓటేస్తే విదేశాలలో భూమి?

January 26, 2017


img

రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు తాము అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, కంప్యూటర్లు, మోటార్ సైకిళ్ళు, బంగారు ఆభరణాలు ఇస్తామని హామీలు ఇస్తుండటం చూశాము. పంజాబ్ లోని అధికార అకాలీదళ్ పార్టీ మరో అడుగు ముందుకు వేసి ఫిబ్రవరి 4న జరుగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మళ్ళీ తమనే గెలిపిస్తే అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ తదితర దేశాలలో లక్ష ఎకరాల భూమి కొని దానిని అక్కడకు వెళ్ళే రైతులకు పంచి పెడతామని ప్రకటించింది. 

పంజాబ్ లో చాలా మంది ప్రజలు ఆ దేశాలకు వెళ్ళి స్థిరపడాలని తహతహలాడుతుంటారు. ఆ విదేశీమోజు కారణంగానే, పంజాబ్ లో మధ్యతరగతి కుటుంబాలు తమ ఆడపిల్లలను ఆ దేశాలలో స్థిరపడిన యువకులకే ఇచ్చి వివాహం చేయాలని తపించిపోతుంటారు. ఆ విదేశీమోజు కారణంగానే వేల సంఖ్యలో యువతులు మోసపోయారు. అనేక వేల కుటుంబాలు చిద్రం అయిపోయాయి. పంజాబ్ ను పట్టి పీడిస్తున్న మరో భంకరమైన సమస్య విచ్చలవిడిగా సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారం. వాటిని రాష్ట్ర ప్రభుత్వం కూడా నియంత్రించలేకపోతుండటంతో వేలాదిమంది పంజాబీ యువకులు వాటికి అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. 

ఈ కారణంగా పంజాబ్ ప్రజలు అకాలీదళ్- భాజపా సంకీర్ణ ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఎన్నికలలో వారి కూటమికి అపజయం తప్పదని, కాంగ్రెస్ లేదా ఆమాద్మీ పార్టీలకే విజయావకాశాలు ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కనుక ఆఖరి అస్త్రంగా అకాలీదళ్ పార్టీ పంజాబీల బలహీనతను సొమ్ము చేసుకొని అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతూనే ఉంది. ఆ హామీని అకాలీదళ్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చినట్లు ఆ పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ నిన్న లుదియానాలో ప్రకటించారు.

ఒకవైపు డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్న విదేశీయులను వెనక్కి తిప్పి పంపుతానని శపధాలు చేస్తుంటే, అమెరికాలో పంజాబీలకు వేరేగా నివాస ప్రాంతాలు, పంటలు పండించుకొనేందుకు భూములు కొని ఇస్తామని ఆచరణ సాధ్యంకాని హామీని అకాలీదళ్ ఇవ్వడం ప్రజలను మోసగించే ప్రయత్నమేనని అర్ధం అవుతూనే ఉంది. మరి పంజాబీలు అకాలీదళ్ ఇస్తున్న ఈ హామీకి ఏవిధంగా స్పందిస్తారో ఫిబ్రవరి 4న ఎన్నికల రోజున చూచాయగా తెలియవచ్చు. మార్చి 11న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు వస్తాయి.


Related Post