బాబు దుమ్ము దులిపేశాడు

January 25, 2017


img

ఏపిలో ప్రత్యేక హోదా ఉద్యమాలు మళ్ళీ మొదలవడంతో దాని కోసం పోరాడిన వారందరూ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వారిలో నటుడు శివాజీ కూడా ఒకరు. ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లు, దాని కోసం రేపు వైజాగ్ బీచ్ లో ఎవరూ ధర్నాలు చేయడానికి వీలులేదనట్లు ఏపి సర్కార్ మాట్లాడుతుండటంతో శివాజీ నేరుగా చంద్రబాబుపైనే తీవ్ర విమర్శలు చేశారు. 

“అమ్మ పెట్టదు అడుక్కొని తిననీయదు అన్నట్లుగా మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడరు. మమ్మల్ని పోరాదనీయారు. మేమేమీ మీకు వ్యతిరేకంగా పోరాడటం లేదే? మరి ఎందుకు అడ్డుకొంటున్నారు? మేము పోరాడితే మీకేమిటి నష్టం? అసలు ఈ రెండున్నరేళ్ళలో పట్టిసీమ, పోలవరం పనులు తప్ప ఏపిలో ఏమైనా పనులు జరిగాయా? ఒకప్పుడు మీ వ్యవహారశైలి వలన రైతులు, ఉద్యోగులను దూరం చేసుకొన్నారు. ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్న యువతను అడ్డుకొని వారినీ దూరం చేసుకోకండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం దీక్ష చేప్పట్టడానికి మీ అనుమతి మాకెందుకు? మా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి మా మీదనే పెత్తనం చేయాలనుకొంటే కుదరదు. నిజానికి ఈ పోరాటం మీరు చేయవలసినది కానీ మేము చేస్తుంటే దానికీ మీరు అడ్డుపడుతున్నారు. మీరు, వెంకయ్య నాయుడు ఇద్దరూ కలిసి ప్రత్యేక హోదా హామీని పక్కదారి పట్టించేసి రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. కనీసం ఇప్పటికైనా మాకు సహకరించండి. లేకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు,” అని శివాజీ చాలా ఘాటుగా ముఖ్యమంత్రికే చివాట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి, ప్రజలను మోసగిస్తునందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.

రేపు విశాఖలో గణతంత్రదినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. రేపే వైజాగ్ బీచ్ లో కొందరు యువకు ప్రత్యేక హోదా కోసం మౌనదీక్ష చేయాలనీ నిశ్చయించుకొన్నారు. గణతంత్రదినోత్సవ సందర్భంగా నిఘా వర్గాలు దేశమంతా హైఅలర్ట్ ప్రకటించినందున రేపటి దీక్షకు ఎత్తి పరిస్థితులలో అనుమతించబోమని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు స్పష్టంగా చెప్పారు. రేపటి దీక్షకు జగన్, పవన్, శివాజీ, మరి కొందరు సినీ నటులు మద్దతు తెలిపారు. తప్పనిసరిగా వారి దీక్షను పోలీసులు అనుమతించవలసిందేనని హెచ్చరిస్తున్నారు. కనుక రేపు విశాఖ నగరంలో ఉద్రిక్త  పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి.


Related Post