రాహుల్ గాంధీ ఖేల్ ఖతం?

January 24, 2017


img

మాజీ ప్రధానులు స్వర్గీయ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇంకా అనేక మంది గొప్ప గొప్ప కాంగ్రెస్ నేతలను అందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ పార్టీకి పుట్టినిల్లు వంటిదని చెప్పవచ్చు. కానీ గత 27 ఏళ్ళుగా ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచుతున్నారు. కనీసం ఈసారైన వారిని ప్రసన్నం చేసుకొని అధికారంలోకి వద్దామనే ప్రయత్నంలో ఎప్పుడూ ఏసీ గదులు, కార్లు, విమానాలలో తిరిగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎండ, దుమ్ము దూళిలో కాళ్ళీడ్చుకొంటూ సుమారు 2,000 కిమీ పాదయాత్ర చేశారు.

ఆయన ‘కాట్ పంచాయితీ’ పేరుతో నులక మంచాలు వేసి రైతులతో సభలు సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఆ సభలకు హాజరైన ప్రజల ధ్యాసంతా ‘ఆయన ఎప్పుడు ప్రసంగం ముగిస్తారా...తాము కూర్చోన్న నులక మంచాన్ని ఎప్పుడు పట్టుకుపోదామనే...’ చివరికి అందరూ అదే పని చేశారు. ఆ విషయం దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా రావడంతో రాహుల్ గాంధీ నవ్వులపాలయ్యారు కూడా.  కనుక రాహుల్ పాదయాత్ర వలన కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఒరిగిందేమీ లేదు ఆయనకి కాళ్ళ నొప్పులు తప్ప. 

అందుకే ఈసారి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేద్దామనుకొన్న కాంగ్రెస్ పార్టీ ధైర్యం చాలక, కీచులాడుకొంటూ రోడ్డున పడ్డ సమాజ్ వాదీ పార్టీతోనే పొత్తులు పెట్టుకొని, అది విదిలించిన 105 సీట్లతోనే సంతృప్తి పడకతప్పడం లేదు. ప్రియాంకా వాద్రా చొరవ వలననే కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ యాదవ్ ఆ మాత్రం  సీట్లు విదిలించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ 105 సీట్లలో సగం అయినా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలదో లేదో అనే అనుమానాలు ఉండటంతో, చిరిగిపోయిన చొక్కాను వేసుకొని తిరుగుతున్న తమ్ముడిని పక్కన పెట్టి ఆమే స్వయంగా రంగంలోకి దిగి పార్టీని ఒడ్డున పడేసేందుకు సిద్దం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. 

ఒకవేళ ఆమె కారణంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు గెలుచుకొన్నా, సర్వే సంస్థల జోస్యం ప్రకారం కేవలం 5-10 సీట్లే సంపాదించుకొన్నా కూడా ఆ ఎఫెక్ట్ మొదట రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ మీదే పడుతుంది. ఎక్కువ గెలిస్తే ఆ క్రెడిట్ ప్రియాంకా వాద్రాకే దక్కుతుంది కనుక ఆమెనే పార్టీ పగ్గాలు చేపట్టామనే డిమాండ్ మొదలవచ్చు. అసలు గెలవలేకపోతే అది రాహుల్ గాంధీ అసమర్ధతగానే పరిగణించబడుతుంది కనుక అప్పుడు కూడా పార్టీలో అందరూ ప్రియాంకా వాద్రానో లేదా మరొక సమర్ధుడైన నేతనో పార్టీ పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేయవచ్చు. కనుక ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ ని ఇంకా ప్రశ్నార్ధకంగా మార్చేయవచ్చు.


Related Post