తూచ్! తెరాసతో పొత్తులేవు

January 20, 2017


img

తెరాస, భాజపాల మద్య గత ఆరేడు నెలలుగా అప్రకటిత దోస్తీ కొనసాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ కళ్ళకు కనబడుతున్నదంతా నిజం కాదని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెపుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయానికి తెరాస మద్దతు ఇచ్చినందుకు సంతోషమే కానీ అంత మాత్రాన్న రెండు పార్టీల మద్య దోస్తీ పక్కా అయిపోయినట్లు అనేసుకోవడం సరికాదని అన్నారు. తమకు తెరాసతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదని, రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్న్యాయంగా ఎదగడంపైనే తమకు ఆసక్తి ఉందని లక్ష్మణ్ చెప్పారు. అందుకు నిదర్శనంగా ఆయన తెరాస ప్రభుత్వంపై గుప్పెడు విమర్శలు కూడా చేశారు. ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీలను ఇంతరవరకు నిలబెట్టుకోలేకపోయిందని, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంలో విఫలం అయ్యిందని లక్ష్మణ్ విమర్శించారు. హామీల అమలు చేయాలని కోరుతూ త్వరలోనే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని అన్నారు.

తెరాస, భాజపాలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలనుకొంటే దాపరికం అవసరం లేదు. వాటికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఎవరి అభ్యంతరాలు కూడా పట్టించుకోనవసరం లేదు. ఆ రెండు పార్టీలు క్రమంగా దగ్గరవుతుండటం కళ్ళకు కనబడుతూనే ఉంది. నిజం చెప్పాలంటే అది ఆహ్వానించదగ్గ పరిణామమే అని చెప్పవచ్చు. ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే తెలంగాణా రాష్ట్రాభివృద్ధి ఇంకా వేగం పుంజుకొంటుంది. అలాగే రాష్ట్ర రాజకీయాలలో ఇంకా సుస్థిరత ఏర్పడుతుంది. పొత్తుల పట్ల ఆ రెండు పార్టీలు ఆసక్తిగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ దాని గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది కనుక దూరంగా ఉంటున్నట్లు చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి అవి బయట పడవచ్చు. ఈలోగా భాజపా ఉనికిని చాటుకొనేందుకు ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం, ప్రజా సమస్యలపై పోరాటాలు వంటి మాటలు చెప్పుకోక తప్పదు. కానీ భాజపా తనకు గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ లోనే గెలవలేనప్పుడు ఇక తెలంగాణా అంతటా గట్టి పట్టు సాధించిన తెరాసకు ఏవిధంగా ప్రత్యామ్నాయం కాగలదు? కనుక భాజపా మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తున్నట్లు చెప్పవచ్చు. తెలంగాణాలో తన మనుగడ కొనసాగించాలనుకొంటే వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకోవడమే దానికి అన్ని విధాల మంచిది. కానీ అందుకు తెరాస అంగీకరిస్తుందా లేదా? అనేదే ముఖ్యం. 


Related Post