రైతులను ఆదుకొనే నాధుడే లేడా?

January 19, 2017


img

ఏపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 33,000 ఎకరాలు సేకరించింది. ఇంకా మరో 50,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని సేకరించబోతోంది. అదిగాక కోర్ క్యాపిటల్ ని ఇతర ప్రాంతాలతో కలుపుతూ అంతర్గత, బాహ్య రోడ్ల నిర్మాణం కోసం భూసేకరణ మొదలుపెట్టడంతో ఆ ప్రాంత రైతులు అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకే సాగుతోంది. 

ఈ సంగతి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి నేడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకొనే ప్రయత్నం చేసినట్లయితే తాము చూస్తూ కూర్చోబోమని జగన్ హెచ్చరించారు. తమ పార్టీ రైతులకు అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడుతుందని హామీ ఇచ్చారు. 

గతంలో తెదేపా ప్రభుత్వం భూసేకరణ మొదలుపెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈవిధంగానే హడావుడి చేసి వెళ్ళిపోయారు. ఆయన తరువాత పవన్ కళ్యాణ్ కూడా వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నేతలు కూడా వచ్చి వెళ్ళారు. కానీ వారిలో ఏ ఒక్కరూ రైతులకు అండగా నిలబడలేదు. అందుకే ప్రభుత్వం 33,000 ఎకరాల భూమిని సేకరించగలిగింది. ఇంకా సేకరిస్తూనే ఉంది కూడా. 

తెదేపాను నమ్మి ఓటేసి అధికారం కట్టబెడితే అది తమ భూములనే బలవంతంగా గుంజుకొంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాకు వారి సమస్యల పట్ల సానుభూతి ఉంది కానీ వారి కోసం ప్రభుత్వంతో పోరాడాలనే చిత్తశుద్ధి లేదు. ఎవరి లెక్కలు వారికున్నాయి. 

ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దీనిని తన పార్టీకి రాజకీయ మైలేజి ఇచ్చే అంశంగానే చూస్తున్నారు తప్ప రైతుల కష్టాలను చూసి కరిగిపోయి వారి తరపున ప్రభుత్వంతో పోరాడాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు కనబడరు. మళ్ళీ ఎప్పటి లాగే ఈసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. రేపు వేరే మరో అంశం మీద పోరాడేందుకు ఆసక్తి చూపుతారు తప్ప ఈ సమస్య గురించి మళ్ళీ మాట్లాడరు. ఈ రెండేళ్ళలో ఈ సమస్యలపై జగన్ వ్యవహరించిన తీరు ఒకసారి చూసినట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది. అందుకే ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం చాలా ధీమాగా భూసేకరణ చేయగలుగుతోందని చెప్పవచ్చు.

ప్రభుత్వమే బలవంతంగా మా భూములు గుంజుకొంటుంటే, ప్రతిపక్షాలు మాకు అండగా నిలబడకపోతే, న్యాయస్థానాలు కూడా పట్టించుకోకపోతే ఇక మేము ఎవరికి మోర పెట్టుకోవాలి? మా కష్టాలు ఎవరికీ పట్టవా? మా కష్టాలు కూడా మీకు రాజకీయ వస్తువుగానే కనబడుతోందా?అని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.      



Related Post