ఆ బిల్లుకి ముహూర్తం ఖరారయింది

January 18, 2017


img

నేటితో ముగిసిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో మైనార్టీ ప్రజల సంక్షేమంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు చెపుతూ చాలా కీలకమైన ప్రకటన చేశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును వచ్చే నెల నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలలోనే ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ విషయంలో తాము ప్రజలకు ఇచ్చిన హామీపై వెనకడుగువేసే ఉద్దేశ్యం లేదని, కానీ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాక న్యాయపరంగా ఎటువంటి చిక్కులు ఎదురవకూడదనే ఉద్దేశ్యంతో అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నందున ఆ బిల్లును ప్రవేశపెట్టడంలో ఆలశ్యమైందని చెప్పారు. దీని కోసం తమిళనాడు ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారమే బిల్లును రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం ముస్లిం ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు చేపడుతోందో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యులకు వివరించారు. 

ఈ సందర్భంగా భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చక్కటి సూచన చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం కంటే సమాజంలో అన్ని కులాలు, మతాల ప్రజలలో పేదరికం అనుభవిస్తున్న వారిని గుర్తించి వారికి రిజర్వేషన్లు కల్పిస్తే దాని వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అన్నారు. 

ఆ ప్రతిపాదన చాలా మంచిదే కానీ ముందుగా కేంద్రప్రభుత్వం దానిని ఆచరణలో పెట్టి చూపిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని అనుసరిస్తాయి. అయితే దేశంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజలను కులాలు, మతాలవారిగానే చూస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నంతకాలం కిషన్ రెడ్డి చెప్పిన ఆ సూచనను అమలుచేయడానికి ఏ ప్రభుత్వం ఇష్టపడదు. 

కేసీఆర్ కి రాష్ట్రంలో ముస్లింల దుస్థితిపై సానుభూతి ఉంటే ఉండవచ్చుగాక, కానీ వారిని ఆకట్టుకొని వారి ఓట్లు కూడా పొంది అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారని చెప్పకతప్పదు. లేకుంటే ఎన్నికల సమయంలో ఆ హామీ ఈయవలసిన అవసరమే లేదు కదా? ఇప్పుడు కూడా ఆ హామీని నిలబెట్టుకోవడం ద్వారా ముస్లిం ఓటర్లను తెరాసవైపు ఆకర్షించి, మళ్ళీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దానిని తప్పుగా పరిగణించరు కనుక అది సహజంగానే కనిపిస్తుంది. కానీ మజ్లీస్ పార్టీ అండదండలు లేకుండా తెరాస అధికారంలోకి రావాలనుకొంటే ఈ ప్రయత్నం తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. 

శాసనసభ ఆమోదించి పంపిన ఆ బిల్లుని కేంద్రప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే దానిని ఆమోదించినట్లయితే, అన్ని రాష్ట్రాల నుంచి వివిధ మతాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ డిమాండ్లు పుట్టుకు వస్తాయి. పైగా ఈ బిల్లుకి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపినట్లయితే ఆ క్రెడిట్ తెరాస ఖాతాలో జమా అవుతుంది తప్ప భాజపా ఖాతాలో కాదు. కనుక ఇల్లలకగానే పండుగ కాదనట్లు శాసనసభలో బిల్లుని ఆమోదించినంత మాత్రాన్న పనైపోయినట్లు కాదు. ఆ బిల్లుని కేంద్రప్రభుత్వం ఆమోదించినా ఆమోదించకపోయినా, దానిని రాష్ట్ర శాసనసభలో ఆమోదించేసి కేంద్రానికి పంపించేసినా బహుశః తెరాసకు అంతే ఫలం దక్కవచ్చు.                మా పరిధిలో మా ప్రయత్నం మేము చేశాము..కేంద్రం చేత ఆమోదింపజేయడానికి కూడా గట్టిగా ప్రయత్నాలు చేశామని చెప్పుకొని ముస్లిం ప్రజల ఓట్లు కోరవచ్చు. 


Related Post