దటీజ్ సల్మాన్ ఖాన్!

January 18, 2017


img

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై రెండు వేర్వేరు కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఫుట్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి తప్పత్రాగి వాహనం నడిపించి ఒకరి మృతికి, ముగ్గురు గాయపడటానికి కారణం అయినందుకు. మరొకటి రాజస్థాన్ లోని జోద్ పూర్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు జింకలను వేటాడినందుకు. ఆ రెండు కేసులలో సల్మాన్ ఖాన్ దోషి అని అందరికీ తెలుసు. 

ముంబై కేసులో అతనికి న్యాయస్థానం (ఐదేళ్ళ జైలు) శిక్ష ఖరారు చేసేముందు తను సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవలసిందిగా అభ్యర్ధించాడు. అదే..తను దోషినని స్వయంగా అంగీకరించినట్లు చెప్పవచ్చు. కానీ అతనిని దోషి అని నిరూపించేందుకు బలమైన ఆధారాలు లేవంటూ ముంబై హైకోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించి దిగువ కోర్టు విదించిన శిక్షలను రద్దు చేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో సల్మాన్ ఖాన్ ఆ కేసు నుంచి బయటపడగలిగాడు. 

జింకల వేట, దాని కోసం అనుమతి లేని ఆయుధాలను ఉపయోగించడంపై దాఖలైన కేసులు కూడా ఇంచుమించు అదే తీరుగా సాగి నేడు అదే విధంగా ముగిసాయి. ఆ కేసును ఈరోజు విచారించిన జోద్ పూర్ కోర్టు దానిలో కూడా అతనికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లేనందున నిర్దోషిగా ప్రకటించి కేసుల నుంచి విముక్తి కల్పించింది.

సల్మాన్ ఖాన్ తన సినిమాలలోనే కాకుండా బయట కూడా చాలా మానవత్వం చూపుతుంటారు. కానీ ఈ రెండు కేసుల విషయంలో ఆయన చాలా మోసపూరితంగా వ్యవహరించడం శోచనీయం. ముంబై కేసులో భాదిత కుటుంబాలను ఆదుకొని ఆ కేసు నుంచి బయటపడవచ్చు. అలాగే జింకలను చంపినందుకు పరిహారంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏదైనా సహాయం చేయవచ్చు. కానీ సల్మాన్ ఆవిధంగా చేయకుండా ఆ కేసులలో తాను నిర్దోషినని వాదించి బయటపడ్డాడు. ఆ కేసుల నుంచి బయటపడగలిగాడు కానీ ప్రజల దృష్టిలో తనకున్న గౌరవాన్ని తనే తగ్గించుకొన్నారని చెప్పక తప్పదు.

ఈ  రెండు కేసులు కొలిక్కి రావడంతో మళ్ళీ అవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 1. సల్మాన్ ఖాన్ నిర్దోషి అయితే ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారిపై కారు ఎవరు నడిపారు? జింకలను ఎవరు చంపారు? ఈ రెండు నేరాలకి ఎవరు బాద్యులు? ఇవి ఎప్పటికీ జవాబు లేని ప్రశ్నలుగా నిలిచిపోతాయి.  



Related Post