పార్టీ ఆదేశిస్తే...దేనికైనా రెడీ!

January 18, 2017


img

గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కేటిఆర్, నారా లోకేష్ తమతమ పార్టీలను గెలిపించుకొనే బాధ్యత తీసుకొన్నప్పుడు, అందరూ వారిరువురిని పోల్చి చూడటం మొదలుపెట్టారు. కనుక ఆ ఎన్నికలు వారిరువురికీ చాలా కీలకంగా మారాయి. వాటిలో తెరాస ఘనవిజయం సాధించడంతో వారిలో కేటిఆర్ దే పైచెయ్యి అయ్యింది.. 

ఈ పరిణామాలన్నీ నారా లోకేష్ రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గ్రహించగానే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. నారా లోకేష్ ను రాజ్యసభకు పంపించి, సుజనా చౌదరి స్థానంలో కేంద్రమంత్రిని చేస్తే ఎలాగుంటుంది? అని ఆలోచనలు చేశారు. కానీ అది అంత మంచిది కాదని భావించడంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకొన్నారు. అతనిని తక్షణమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని తెదేపా మంత్రులు, నేతలు లోకేష్ భజన కార్యక్రమం మొదలుపెట్టేసారు. దానికి దసరా, దీపావళి అంటూ ముహూర్తాలు కూడా వినబడ్డాయి కానీ నేటి వరకు అయన చేరలేదు. ప్రజలు అతనిని కేటిఆర్ తో పోల్చి చూడకుండా ఉండేందుకే తెదేపా ఈ ప్రతిపాదనలను తెర మీదకు తీసుకువచ్చిందేమో తెలియదు కానీ అప్పటి నుంచి  ప్రజల దృష్టి ఆ విషయంపై నుంచి మళ్ళింది. ఆ తరువాత కొన్నాళ్ళకు తెదేపా నేతల భజన కార్యక్రమం కూడా నిలిపివేశారు.

నిజానికి వారిరువురినీ పోల్చి చూడవలసిన అవసరమే లేదు. కానీ ఇద్దరూ ముఖ్యమంత్రుల కుమారులు కావడం, వారి రాజకీయ వారసులు కావడం, గ్రేటర్ ఎన్నికలలో తలబడటం చేత వారిని పోల్చి చూడటం మొదలైంది. గ్రేటర్ లో తెరాసకు ఘనవిజయం అందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు  మున్సిపల్ శాఖను కూడా బహుమానంగా కట్టబెట్టడంతో మరో మెట్టు ఎక్కినట్లయింది. అప్పటి నుంచే కేటిఆర్ ప్రభుత్వంలో, తెరాస పార్టీలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు సంపాదించుకోగలిగారు. అంతే కాదు...రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి సమర్ధుడైన నేతగా గుర్తింపు సంపాదించుకోగలిగారు. కానీ నారా లోకేష్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. 

మళ్ళీ ఇన్నాళ్ళకు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి “నేను మంత్రివర్గంలో చేరబోతున్నానని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే. పార్టీ ఆదేశిస్తే 2019 ఎన్నికలలో పోటీ చేస్తాను,” అని చెప్పారు. 

మీడియాలో వచ్చిన వార్తలు ఊహాగానాలే కావచ్చు. కానీ రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు చెప్పిన మాటలు ఊహాగానాలు కావు కదా? అది వేరే సంగతి. తను 2019 ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నట్లు నారా లోకేష్ గత ఎన్నికల సమయంలోనే చెప్పారు. అయినా ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొడుకైన నారా లోకేష్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎన్నికలలో పోటీ చేయవచ్చు...మంత్రివర్గంలో చేరవచ్చని అందరికీ తెలుసు. పార్టీ ఆదేశిస్తే..అనే పదం తగిలించడం కేవలం శాస్త్రం కోసమే అనుకోవలసి ఉంటుంది. కానీ నేటికీ అతను తండ్రి చాటు బిడ్డేనని చెప్పక తప్పదు కనుక అతను రాజకీయాలలో తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోవలసి ఉంది. 


Related Post