సింగ్ సాబ్ అవేం మాటలు?

January 12, 2017


img

కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తునందున ఆపార్టీ నేతలు అందుకు అనుగుణంగానే మాట్లాడటం సహజం. ఆవిధంగా మాట్లాడిన వారిలో మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి.చిదంబరం కూడా ఉన్నారు. నోట్ల రద్దు ఒకక వినాశకరమైన నిర్ణయమని, దాని వలన రానున్న రోజులలో దేశంలో పెను సంక్షోభం ఏర్పడబోతోందని హెచ్చరించారు. వారిరువురూ ఈ హెచ్చరికలను ఆర్ధికవేత్తలుగా చేశారో లేకపోతే కాంగ్రెస్ నేతలుగా చేశారనే దానిని బట్టి వారి మాటలకు విలువ ఉంటుంది. ఆర్ధికవేత్తలుగా వారు ఈ హెచ్చరికలు చేసి ఉండి ఉంటే అవి చాలా ఆందోళన కలిగించేవే. ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే నివారణోపాయాలు ఆలోచించి సన్నధం కావలసిందే. కానీ వారు ఆర్ధికవేత్తలుగా కాక సగటు కాంగ్రెస్ నేతల్లగే మాట్లాడినట్లు చెప్పవచ్చు.

వారిరువురూ గొప్ప ఆర్దికవేత్తలే అయినప్పటికీ అప్పుడూ, ఇప్పుడూ కూడా సోనియా గాంధీ కనుసన్నలలో మెలుగుతుంటారని అందరికీ తెలుసు. ఆ కారణంగానే వారిరువురూ తమ హయంలో దేశ ఆర్ధికపరిస్థితిని బ్రష్టు పట్టించారు. ఒక్క ఆర్ధిక రంగాన్నే కాకుండా అన్ని రంగాలను కూడా బ్రష్టు పట్టించారు. ఆ సంగతి యావత్ దేశ ప్రజలే కాకుండా అనేక ప్రపంచ దేశాలు, విదేశీ మీడియా కూడా తెలుసు. ఒకవేళ వారు తమ హయంలో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదే కాదు. మోడీ అధికారంలోకి రాగలిగేవారే కాదు. 

తాము అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని తిరోగమనపధంలో పరుగులు తీయించిన వారిరువురూ ఇప్పుడు మోడీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ కోణంలో నుంచే ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని చూసి, తమ మేధస్సుపై ప్రజలకున్న నమ్మకాన్ని ఉపయోగించుకొని వారినీ తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం వారు ఆవిధంగా మాట్లాడి ప్రజల దృష్టిలో తమ విలువను తామే తగ్గించుకొంటున్నారని చెప్పకతప్పదు. 

 మోడీ తీసుకొన్న నిర్ణయం మంచిదా కాదా? డాని వలన దేశానికి లాభం చేకూరుతుందా లేక వారు చెపుతున్నట్లు ఇంకో పెను సంక్షోభంలో చిక్కుకోబోతుందా అనేది కాలమే చెపుతుంది. అప్పుడు ఎవరి వాదనలలో ఎంత నిజముందో అందరికీ అర్ధం అవుతుంది.  


Related Post