భూసేకరణపై అంతా అయోమయం

January 12, 2017


img

తెరాస సర్కార్ ప్రాజెక్టుల కోసం చేస్తున్న భూసేకరణ అన్యాయం, అక్రమం, పేద రైతులను దౌర్జన్యంగా దోచుకోవడమేనని ప్రతిపక్షాలు, తెలంగాణా జెయేసి వాదిస్తుంటాయి. రాష్ట్రాభివృద్ధి కోసం తాము ప్రయత్నిస్తుంటే వాళ్ళు తమ కాళ్ళలో కట్టెలు పెడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు వాదిస్తుంటారు. 

భూసేకరణ కోసం కేంద్రప్రభుత్వం చక్కటి భూసేకరణ చట్టాన్ని రూపొందిస్తే, తెరాస సర్కార్ దానిని పక్కన పడేసి జీవో నెంబర్:123ని ఎందుకు తెచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్న. తెరాస సర్కార్ రైతులను బెదిరించి, భయపెట్టి వారి భూములను దౌర్జన్యంగా లాక్కొంటుంటే చూస్తూ ఊరుకోబోమని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.  

తమ ప్రభుత్వం రైతు పక్షపాతి కనుకనే వారికి అంతకంటే మెరుగైన ప్యాకేజి ఇచ్చి ప్రాజెక్టులు కట్టి వారికి మేలు చేయాలని తపిస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుపడుతున్నాయని తెరాస సర్కార్ ప్రశ్నిస్తోంది. శాసనసభలో అవి ప్రాజెక్టుల పురోగతి గురించి తమ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, బయట భూసేకరణకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయని తెరాస ఆరోపిస్తోంది. భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు ఏవిధంగా కట్టగలమని  మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ హయంలో తెలంగాణాకు తీరని అన్యాయం చేయడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణాకు తీరని ద్రోహం చేస్తోందని, కనుక ఈసారి కాంగ్రెస్ నేతలు కనబడితే తరిమికొట్టాలని హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. 

తెరాస, ప్రతిపక్షాలు, జెయేసిల ఈ వాదనలన్నీ సహేతుకంగానే కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే వాళ్ళందరూ రైతుల కోసమే పోరాడుకొంటున్నారు. అందరి ఉద్దేశ్యం రైతుకు మేలు చేయడమే అయినప్పుడు వారిలో వారే పోరాడుకోవడం దేనికి? అందరూ కూర్చొని చర్చించుకొని ఈ సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనలేరా? ఈ సమస్యకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించకుండా వారిలో వారే పోరాడుకొంటున్నారంటే దానర్ధం వారికి ఈ భూసేకరణ సమస్యపై చిత్తశుద్ధి లేదనుకోవలసి వస్తుంది. దాని నుంచి అందరూ రాజకీయ మైలేజి కోసమే పోరాడుకొంటున్నట్లు అనుమానించవలసి ఉంటుంది. 

ఈవిషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా వ్యవహరించినప్పటికీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా అవసరం. కనుక పూర్తి పారదర్శకంగావ్యవహరిస్తూ ప్రజలలో నెలకొన్న అయోమయం తొలగించవలసిన భాద్యత ప్రభుత్వం పైనే ఉంది లేకుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ వాదనల వలన ప్రజలలో దానిపట్ల వ్యతిరేకత పెరిగితే అదే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 


Related Post