ఆ హోదాలో చేసినా కులం ప్రసక్తేనా?

January 04, 2017


img

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ప్రదీప్ చంద్రకు ప్రభుత్వం తరపున మంత్రులు కేటిఆర్, కడియం శ్రీహరి ఈరోజు వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా అయన మాట్లాడుతూ తన పదవీకాలం పొడిగింపు ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియారిటీ ప్రకారం డిశంబర్ 1న ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన ఆయన పదవీ కాలం ముగియడంతో నెల రోజులు తిరక్కముందే పదవీ విరమణ చేయవలసి వచ్చింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసినప్పటికీ దానిని మన్నించకపోవడంతో ఆయన పదవీ విరమణ చేయవలసి వచ్చింది. కనుక ఆయన కొంత అసంతృప్తికి గురవడం సహజమే. 

అందుకే తాను వన్ డౌన్ బ్యాట్స్ మ్యాన్ గా వచ్చి, తన ప్రమేయం లేకుండానే రన్ అవుట్ అయ్యనని అన్నారు. షెడ్యూల్ కులాలకు చెందిన సమర్ధులైన అధికారులపట్ల ప్రభుత్వం వివక్ష చూపినట్లయితే అది యువ అధికారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. తన పదవీ కాలంలో చాలా సమర్ధంగా, నిజాయితీగా ఎవరికీ తలవంచకుండా పనిచేశానని అన్నారు. 

ప్రదీప్ చంద్ర ఆవేదన సహేతుకమే. చిరకాలం వివిధ శాఖలలో పనిచేసి అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి, దానిని నెలరోజులలోనే కోల్పోవడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే. ఆయన పదవీకాలం పొడిగించకపోవడానికి ఆయన కులమే కారణం అయితే తప్పకుండా గర్హించవలసిందే. ఆవిధమైన వివక్ష చూపినట్లయితే ఆయన చెప్పినట్లు ఇతర అధికారులపై కూడా ఆ ప్రభావం పడవచ్చు. 

అయితే దీనినే మరో కోణంలో నుంచి చూసినట్లయితే, ఆయన తన పదవీ కాలం పూర్తి చేసిన తరువాతనే పదవీ విరమణ చేశారు తప్ప ఆయనను మద్యలో తొలగించలేదు. సీనియారిటీ ప్రకారం న్యాయంగా ఆయనకు దక్కవలసిన పదోన్నతి కూడా పొందిన తరువాతే పదవీ విరమణ చేశారు. పదవీ కాలం పొడిగింపు అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది తప్ప పొడిగింపు తప్పనిసరి కాదు. కనుక నియమ నిబందనల ప్రకారం ఆయనకు ఎటువంటి అన్యాయం జరుగలేదని స్పష్టం అవుతోంది. తను చాలా నిజాయితీగా, సమర్ధంగా పనిచేశానని స్వయంగా చెప్పుకొన్నారు. అందుకే అయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి అత్యున్నతమైన పదవిని చేపట్టే అవకాశం దక్కిందని భావించవచ్చు. 

తన ప్రతిభ, శక్తి సామర్ధ్యాలతో ఆ స్థాయికి ఎదిగిన అయన తన పదవీ కాలం పొడిగించనందుకు తన కులం ప్రస్తావన చేయడం శోచనీయం. తన సర్వీసులో చిరకాలం పాటు తన క్రింది స్థాయి అధికారులకి, ఉద్యోగులకి, ప్రజలకి మార్గదర్శనం చేసిన వ్యక్తులు కూడా ఇంత సంకుచితంగా ఆలోచించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన తన అసంతృప్తిని ఆవిధంగా వ్యక్తం చేసి ఉండవచ్చు కానీ అది తన శక్తి సామర్ధ్యాలను తనే కించపరుచుకొన్నట్లుంది. 


Related Post