పొమ్మనక ముందే పోతానంటున్న షీలా!

January 04, 2017


img

ఆమె అపార రాజకీయ అనుభవజ్ఞురాలే..కానీ వృద్ధాప్యం ముంచుకొచ్చేసింది. అయినా కాంగ్రెస్ పార్టీ పిలిచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబెడితే కాదనలేకపోయింది. ఆమే..డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. యూపి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఆమె వయసు 78 సం.లు. గట్టిగా నడువలేరు..నిలబడలేరు..కనీసం మాట్లాడలేరు. అది ఆమె తప్పు కాదు. అంత వయసు ఉన్న ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ తప్పు..తొందరపాటు. 

కాంగ్రెస్ పార్టీ మరో తప్పు కూడా చేస్తోంది. తమ చంకలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్ధిని పెట్టుకొని మరొక ముఖ్యమంత్రితో పొత్తులు పెట్టుకోవాలనుకొంటోంది. ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ పొత్తులు పెట్టుకోవడం అంటే ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరించడమే అవుతుంది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి, దానికి సలహాలు ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ కి తెలియదనుకోలేము. కానీ అఖిలేష్ యాదవ్ పొత్తులకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. 

తండ్రితో గొడవలు పడుతున్న అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కోరుకొంటూనే ఉన్నాడు. కనుక అతను కాంగ్రెస్ పొత్తుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడం సహజమే. ఒకవేళ రెండు పార్టీల మద్య పొత్తులు ఖాయం అయితే అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలోకి దిగిన షీలా దీక్షిత్ ను కాంగ్రెస్ పార్టీ పక్కన పడేయడం ఖాయం అని వేరేగా చెప్పనవసరం లేదు. 

షీలా దీక్షిత్ తన అపార రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీని యూపి ఎన్నికలలో గెలిపించలేకపోవచ్చునేమో కానీ తనకు జరుగబోయే పరాభవాన్ని మాత్రం ముందే పసిగట్టగలిగారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయక మునుపే ఆమె తెలివిగా, ఒకవేళ అఖిలేష్ యాదవ్ తమ పార్టీతో ఎన్నికల పోత్తులకు అంగీకరించినట్లయితే తను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తప్పుకొంటానని ప్రకటించేసి తన గౌరవం కాపాడుకొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ, దానికి సలహాలు ఇస్తున్న ప్రశాంత్ కిశోరే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా షీలా దీక్షిత్ మాత్రం ఈ విషయంలో సరైన నిర్ణయమే తీసుకొన్నారని చెప్పవచ్చు. అందుకు ఆమెను అభినందించక తప్పదు. 


Related Post