కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే...

January 03, 2017


img

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోలుకొనే మరొక 10ఏళ్ళ వరకు అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. అలాగే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది. కానీ తెలంగాణా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ మళ్ళీ  కోలుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ ఎప్పటికైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకొంటే ముందుగా దాని నేతలు తమ సంప్రదాయ ఆలోచనా విధానాలు, మూస రాజకీయ ధోరణుల నుంచి బయటకు వచ్చి రాష్ట్రాభివృద్ధి చేసి చూపించగలమనే భరోసా ప్రజలకు కలిగించవలసి ఉంటుంది. ఈ సూత్రం ఒక్క తెలంగాణా కాంగ్రెస్ నేతలకే కాదు దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలకు కూడా వర్తిస్తుంది. 

ఒకప్పుడు ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు కులం, మతం పేరిట ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి, డబ్బు, మద్యం, బహుమతులు పంచిపెట్టి, నోటికి వచ్చిన హామీలను ప్రకటించేసి అధికారంలోకి వచ్చేవారు. నేటికీ ఆ పరిస్థితులలో మార్పు లేనప్పటికీ గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉంటున్నారు. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తోందో దానికే పట్టం కడుతున్నారు. ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపినందుకు నరేంద్ర మోడీని ఏకంగా ప్రధానమంత్రిని చేశారు. గత రెండు మూడు దశాబ్దాలుగా అన్ని రంగాలలో పూర్తిగా బ్రష్టు పట్టిపోయిన బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించినందుకు అక్కడి ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కట్టారు. అలాగే ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు నాయుడు తమ తమ రాష్ట్రాలని అభివృద్ధి చేసి చూపించగలిగితే ప్రజలు మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేసి గెలిపించవచ్చు. 

కనుక కాంగ్రెస్ నేతలు గ్రహించవలసింది ఏమిటంటే ‘కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ రాజకీయాలు’ చేసినంత మాత్రాన్న ప్రజలు తమ పార్టీని గెలిపించబోరని! కనుక కాంగ్రెస్ నేతలు అందరూ తమ సంప్రదాయ రాజకీయ, ఆలోచనా విధానాలను వదిలించుకొని ప్రజాల ఆలోచన ధోరణికి అనుకూలంగా తమను తాము మలుచుకోవలసి ఉంటుంది. పనికిమాలిన రాజకీయాలు చేయడం మానుకొని అభివృద్ధి గురించి ఆలోచించడం, మాట్లాడటం నేర్చుకోవలసి ఉంది. వారు ఆవిధంగా మారగలిగినప్పుడు, వారిలో కలిగిన ఆ మార్పును ప్రజలు కూడా తప్పకుండా గుర్తించి ఆదరిస్తారు. 

ఇక అధికారంలో ఉన్న పార్టీలు కూడా తమ అధికారాన్ని కలకాలం నిలుపుకోవాలనుకొంటే దానికి ఏకైక మంత్రం..అభివృద్దే. రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పధంలో తీసుకుపోగలిగితే, ప్రతిపక్షాలు ఎన్ని కుప్పిగంతులు వేసినా వాటిని చూసి అభద్రతాభావంతో భయపడనవసరం లేదు. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలను గుప్పిస్తే ఏమవుతుందో స్వయంగా తెలుసుకొన్నాయి కనుక కనీసం వచ్చే ఎన్నికలలో ఆ పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే మంచిది. లేకుంటే ప్రతిపక్షాలు ఆ హామీల అమలు కోసం ప్రభుత్వాలపై నిరంతరం తీవ్రంగా ఒత్తిడి చేస్తునే ఉంటాయని మరిచిపోకూడదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీయే తప్పకుండా గెలుస్తుందని జైపాల్ రెడ్డి వంటివారు గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ ఆ కలలు సాకారం కావాలంటే ముందుగా తమ మూస రాజకీయ ధోరణి నుంచి బయటపడి, ప్రజల నమ్మకం పొందడం చాలా అవసరమే. 


Related Post