మోడీ మహిమ చూపాలంటారు..కానీ దానిని గుర్తించలేరు

January 03, 2017


img

డు తెలుగు రాష్ట్రాలలో భాజపా నేతలు అధికార పార్టీలను విమర్శిస్తూ వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని ఆత్మవంచన చేసుకొంటూ కాలక్షేపం చేసేస్తుంటారు తప్ప అందుకోసం ఎటువంటి ప్రయత్నాలు చేసిన దాఖాలాలు కనబడవు. ప్రధాని నరేంద్ర మోడీ ‘మహిమ’ తోనే తాము అధికారంలోకి వచ్చేస్తామని కలలు గంటుంటారు..కానీ ఆయన అమలుచేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొనే ప్రయత్నం కూడా చేయరు. ఒకవేళ చేసినా ఏదో మొక్కుబడి తంతే. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు వంటి చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నప్పుడు అది యావత్ దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించగలిగింది కానీ భాజపా నేతల చేత మాట్లాడించలేకపోయిందని చెప్పక తప్పదు.  

ఆయన నిర్ణయాన్ని గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడిన భాజపా నేతలు లేరు. ఆ నిర్ణయం వలన దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రతిపక్షాలన్నీ కట్టకట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీపై, కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నప్పుడు కూడా భాజపా నేతలు ఆయనకీ అండగా నిలబడలేకపోయారు. నిజం చెప్పాలంటే వారందరి కంటే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా నయం. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని శాసనసభలో బయటా కూడా చాలా గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడటమే కాకుండా మోడీ ఆశయానికి తగ్గట్లుగా రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. 

ఇప్పుడు దేశంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నందున భాజపా నేతలు ఒకరొకరు మెల్లగా నోరు విప్పి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంత కాలం మౌనం వహించిన పురందేశ్వరి కూడా నోట్ల రద్దు వలన కలిగే ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. నోట్ల రద్దు తరువాత ఏర్పడిన కష్టాలు, అందుకు గల కారణాల గురించి మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చా భారత్ ఆ పధకం క్రింద మరుగుదొడ్లు నిర్మాణం, మహిళా సాధికారత వగైరా అంశాల గురించి మాట్లాడారు. 

అయితే ఈ నాలుగు ముక్కలే గత రెండు నెలలో భాజపా నేతలు అందరూ గట్టిగా మాట్లాడి ఉండి ఉంటే అది భాజపాకు, కేంద్రానికి, ప్రధాని మోడీకి అండగా నిలబడినట్లు ఉండేది. కానీ అప్పుడు భాజపా నేతలు చాలా మంది మౌనం వహించడం ద్వారా తాము నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకమనే సంకేతాలు ఇచ్చినట్లయింది. ప్రధాని నరేంద్ర మోడీ మహిమతో అధికారంలోకి వచ్చేద్దామని కలలు గంటున్న భాజపా నేతలు, అయనకి అండగా నిలబడాలనుకోలేదు. ఆయన ప్రవేశపెడుతున్న పధకాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొన్న దాఖలాలు కనబడవు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా ఎన్నటికీ ఎదిగే అవకాశం కనబడదు. 


Related Post