తమిళనాడులో చిన్నమ్మ శకం షురూ

December 31, 2016


img

తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ శనివారం పార్టీ బాధ్యతలు చేపట్టారు. విశేషం ఏమిటంటే, ఆమెకు ఎటువంటి హక్కు, అధికారం లేకపోయినా జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ లోనే ఉంటున్నారు. జయలలిత వినియోగించిన కారులోనే పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టారు కానీ ఆమెను ఎవరూ ప్రశ్నించలేకపోవడంతో ఇక ఆమె పార్టీపై, ప్రభుత్వంపై తనకున్న పట్టును మరొకసారి నిరూపించి చూపుకొన్నట్లయింది. కనుక నేటి నుంచి తమిళనాడులో చిన్నమ్మ శకం మొదలైనట్లే చెప్పవచ్చు.

పార్టీ పగ్గాలు చేపడుతున్న సందర్భంగా శశికళ ఒకసారి అమ్మను తలుచుకొని మొసలి కన్నీళ్ళు కార్చి అమ్మ బాటలోనే పార్టీని నడిపిస్తానని చెప్పారు. మొసలి కన్నీళ్ళని ఎందుకు అనవలసి వస్తోంది అంటే ఆమెకి నిజంగా అమ్మపై అభిమానం ఉండి ఉంటే పార్టీ పదవి చేపట్టడానికి ఇంతవేగంగా పావులు కదిపేవారు కారు. అమ్మ మృతికి శశికళే కారణమని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, అమ్మ మృతిపై సాక్షాత్ రాష్ట్ర హైకోర్టే అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ముందుగా వాటి నుంచి ఆమె బయటపడి తన నిజాయితీని నిరూపించుకొని ఉండాలి. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవీ చేయకుండా శరవేగంగా పార్టీ పగ్గాలు చేజిక్కించుకొన్నారు. అంతే కాదు...పార్టీ పగ్గాలు చేపట్టడానికి తనకు పోటీగా మరెవరూ నామినేషన్ వేయకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఆమె చర్యలను బట్టి ఆమె ఆ పదవి కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కనుక అమ్మ గురించి ఆమె కన్నీళ్ళు పెట్టుకొన్నారంటే నమ్మశక్యంగా లేదు. 

జయలలిత చనిపోయి ఇంకా మూడు వారాలు పూర్తి కాకముందే ఆమె స్థానాన్ని ఆక్రమించుకొని తనే ఆమెకి ప్రతిరూపం అన్నట్లుగా శశికళ వ్యవహరిస్తున్నారు. ఆమెనే ‘అమ్మ అమ్మా’ అంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు సంభోదిస్తుండటం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. జయలలిత స్థానంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త అమ్మ ఫోటోలు, కటౌట్లు బ్యానర్లే అంతటా దర్శనమిస్తున్నాయి. ఇన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను, ఆ రాష్ట్ర ప్రజలను తీవ్ర ప్రభావితం చేసి వారి ఆదరాభిమానాలు పొందిన స్వర్గీయ జయలలిత ఆనవాళ్ళను శశికళ చాలా తక్కువ సమయంలోనే చేరిపివేయాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఈ సవతి తల్లిని అంగీకరిస్తారో లేదో ఎన్నికలకు వెళ్ళినప్పుడే తెలుస్తుంది.


Related Post