అది దళితులని వేదించడమే: మాయావతి

December 27, 2016


img

నోట్ల రద్దు తరువాత యూపిలో బహుజన్ సమాజ్ వాది బ్యాంక్ ఖాతాలో రూ.104 కోట్లు జమా చేసినట్లు ఈడి అధికారులు గుర్తించిన విషయం బయటకి పొక్కడంతో ఆ పార్టీ అధినేత్రి మాయావతి యధాప్రకారం తన రాజకీయ చతురత అంతా ఉపయోగించి కేంద్రప్రభుత్వం, భాజపాలపై ఎదురుదాడి చేశారు.

“నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజల ఆగ్రహానికి గురైన ప్రధాని నరేంద్ర మోడీ, వచ్చే ఏడాది జరుగనున్న యూపి శాసనసభ ఎన్నికలలో తమ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారనే భయం పుట్టడంతో మా పార్టీని ఈవిధంగా బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దళితుల పట్ల తమకి చాలా ప్రేమ ఉందని మోడీ చెప్పుకొంటుంటారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దళితుల పార్టీపై దాడులు చేయిస్తున్నారు. ఇదేనా దళితులపై ఆయనకుండే ప్రేమ?బ్యాంకులో జమా చేసిన ఆ డబ్బు అంతా మా పార్టీదే. దానికి లెక్కలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. మా పార్టీ ఫండ్ గురించి ప్రశ్నిస్తున్న ఈడి అధికారులు భాజపా ఫండ్స్ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్రప్రభుత్వానికి శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు,” అని అన్నారు.

నోట్ల రద్దు చేసిన తరువాతనే ఆ ఆ రూ.104 కోట్లు బయటకి రావడం గమనిస్తే ఒకవేళ పాత నోట్లు రద్దు చేయకుంటే అవి ఎన్నడూ బ్యాంకుకి చేరేవేకావని అర్ధం అవుతోంది. విధిలేని పరిస్థితులలోనే అంత బారీ మొత్తాన్ని బ్యాంకులో జమ చేసినట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ దానికి లెక్కలు, ఆధారాలు ఉన్నట్లయితే ఈడిని, మోడీని చూసి మాయావతి భయపడనవసరం లేదు. ఈడి చర్యలని దళితులపై దాడిగా కలరింగ్ ఇవ్వనవసరమే లేదు. అసలు ఈడి ఆ విషయం గురించి అడుగకముందే ఆమె స్వయంగా ఆ డబ్బు తాలూకు వివరాలు ప్రకటించి ఉండవచ్చు. కానీ ఈడి గుర్తించే వరకు దాని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ప్రశ్నించగానే ఎదురుదాడి చేస్తున్నారు. మాయావతి ఒక సగటు రాజకీయ నేతలాగానే వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవేళ భాజపా, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మద్య ఎన్నికల పొత్తులు కుదిరితే అప్పుడు కేంద్రప్రభుత్వం కూడా సగటు రాజకీయ పార్టీలాగే ఆలోచించి, ఈ కేసుని అతకెక్కించేసినా ఆశ్చర్యం లేదు. అవినీతికి పాల్పడినవారిని కటినంగా శిక్షించలేనప్పుడు మళ్ళీ నీతి, నిజాయితీ, నైతిక  విలువల గురించి లెక్చర్లు దంచడం కూడా దండుగే. ప్రజలను అపహాస్యం చేయడమే.


Related Post