తుపాకి చూపించి ఐటి దాడులు చేశారుట!

December 27, 2016


img

తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు వివేక్ ఇళ్ళపై ఆదాయపన్ను శాఖా అధికారులు ఇటీవల దాడులు చేసి బారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ “సి.ఆర్.పి.ఎఫ్.జవాన్ల చేత నాకు తుపాకీ చూపించి భయపెట్టి మరీ ఐటి అధికారులు నా ఇంటిపై దాడులు నిర్వహించారు. నేనేమైన క్రిమినల్ లేక టెర్రరిస్టునా..ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిని. నా కొడుకు పేరిట సెర్చ్ వారెంట్ తో వచ్చి ఐటి అధికారులు నా ఇంటిపై దాడులు చేశారు. కేంద్రప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది. నా ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేయడానికి ఎవరి అనుమతైన తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినైన నాకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్య అన్నాడిఎంకె కార్యకర్తల పరిస్థితి ఏమిటి?అమ్మ బ్రతికి ఉండి ఉంటే అసలు ఎవరైనా ఇటువంటి సాహసం చేయగలిగి ఉండేవారా? నేను అమ్మ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాను. నిబందలకు వ్యతిరేకంగా పనిచేయనని భయపడుతున్న వాళ్ళే నన్ను ఈవిధంగా అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుసు. అయినా నేనేమీ భయపడిపోను. కేంద్రప్రభుత్వం సంగతి నేను న్యాయస్థానంలోనే తేల్చుకొంటాను. శేఖర్ రెడ్డితో నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. అతనీతో కేవలం పరిచయం మాత్రమే ఉంది,” అని రామ్మోహన్ రావు అన్నారు.

ఆయన చెప్పిన మాటలలో ఒకే ఒక నిజం కనిపిస్తోంది. అమ్మ బ్రతికి ఉండి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేదే కాదనే మాట వాస్తవం. అయితే రామ్మోహన్ రావు-ఆయన కొడుకు వివేక్-శేఖర్ రెడ్డిల మద్య ఇన్నేళ్ళుగా జరుగుతున్న వ్యాపారాలావాదేవీల గురించి అమ్మకైనా తెలుసో లేదో అనే అనుమానం కలుగుతోంది. అయితే ఆదాయపన్ను శాఖా అధికారులు ఆయన ఇంటి నుంచి, ఆయన కుమారుడు ఇంటి నుంచి బారీగా నగదు, బంగారం పట్టుకొన్న తరువాత కూడా రామ్మోహన్ రావు ఇంత ధాటిగా వాదించడం గొప్ప విషయమేనని చెప్పక తప్పదు. ఆయన కేంద్రప్రభుత్వంపై కోర్టుకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఐటి, ఈడి అధికారులు మాత్రం ఆయనని కోర్టుకి రప్పించడం తధ్యం.

రామ్మోహానరావు ఆరోపణలపై కేంద్రమంత్రి అర్జున్ రామ్ స్పందిస్తూ “అవినీతికి పాల్పడితే ప్రధాన కార్యదర్శి అయినా సామాన్య పౌరుడైన ఒక్కటే. చట్టం ముందు అందరూ సమానమే. ఆవినీతికి పాల్పడి పట్టుబడి మళ్ళీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు,” అని అన్నారు. 


Related Post