హైదరాబాద్ అభివృద్ధికి ఇంకా అన్నేళ్ళా?

December 26, 2016


img

“హైదరాబాద్ నగరాన్ని నేనే అభివృద్ధి చేశానని” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పుకొంటుంటే, “హైదరాబాద్ నగరం నైజాం నవాబు కాలం నాటికీ పూర్తిగా అభివృద్ధి చెందిదని” తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వాదించేవారు. కానీ గట్టిగా వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మొన్న అందరూ చూశారు. అంటే ఇంకా చాలా అభివృద్ధి జరుగవలసి ఉందని అర్ధం అవుతోంది

హైదరాబాద్ అభివృద్ధి గురించి ఈరోజు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ సమాధానం చెపుతూ "నగరం అభివృద్ధి కోసం 100 రోజులు ప్రణాళికని మా అంతట మేమే రూపొందించుకొన్నాము తప్ప ప్రతిపక్షాలో మరొకరో చెప్పడం వలన కాదు. నగరంలోని కనీసం 1,000 పబ్లిక్ టాయిలెట్లు ఉండాలనే ఉద్దేశ్యంతో నగరంలో ఉన్న 370 పెట్రోల్ బంకులతో మాట్లాడి వాటిలో ఉన్న టాయిలెట్లనే ప్రజలకి అందుబాటులోకి తెచ్చాము. త్వరలోనే మరికొన్ని అందుబాటులోకి తేబోతున్నాము. బస్సులు ఆగే చోటే బస్టాండ్లు నిర్మిస్తున్నాము. రెండున్నర సంవత్సరాలలో సుమారు రూ.910 కోట్లు రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేశాము. ఐటి కారిడార్లలో వైట్ టాపింగ్ రోడ్లు నిర్మాణానికి టెండర్లు పిలిచాము. వాటి కోసం రూ.200 ఖర్చు చేయబోతున్నాము."

"ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తవడానికి వేల కోట్లు అవసరం ఉంది. కేంద్రప్రభుత్వం సహాయం కూడా కోరుతున్నాము. ఈ విషయంలో భాజపా సభ్యులు కూడా తమ పలుకుబడి ఉపయోగించి కేంద్రప్రభుత్వం నుంచి విడుదలయ్యేలా సహాయపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వనగరాలు రాత్రికి రాత్రే ఏర్పడవు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి కనీసం మరో 7-8 సం.లు వరకు సమయం పట్టవచ్చు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని వారికి ఎంత తపన ఉందో, ఈ కుర్చీలలో కూర్చొన్న మాకు అంతకు రెట్టింపు తన ఉందని గుర్తించాలని ప్రతిపక్షాలను కోరుతున్నాను," అని  చెప్పారు. 

అన్ని విధాలుగా చాలా అభివృద్ధి చెందిందని భావిస్తున్న హైదరాబాద్ నగరమే అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగాలంటే మరో 7-8 ఏళ్ళు పడుతుందని మంత్రి కేటిఆర్ చెపుతున్నప్పుడు, కనీసం ఒక్క భవనం కూడా నిర్మించని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో...? ఈ లెక్కన చూస్తే ఈ తరం వాళ్ళు ఎవరూ దానిని తమ జీవిత కాలంలో చూసే అవకాశం ఉండదేమో? 


Related Post