ఆ నోట్లు వారికి..ఈ నోట్లు మనకి..

December 26, 2016


img

డిశంబర్ 30 గడువుకి నేటితో కలిపి ఇంకా 5రోజులు మాత్రమే మిగిలి ఉంది. దేశంలో పాత పెద్ద నోట్లు అన్నీ దాదాపుగా బ్యాంకులకు చేరిపోయాయి. ఇంకా అక్కడక్కడ నల్లకుభేరుల వద్ద ఏమైనా మిగిలి ఉంటే అది 31 తరువాత ఏ చెత్త కుప్పలలోనో..మురికి కాలువలలోనో కనబడే అవకాశాలే ఎక్కువ. 

రిజర్వ్ బ్యాంక్ మొదట రూ.2,000 నోట్లని మాత్రమే ఎక్కువగా ముద్రించి, ఇప్పుడు గడువు దగ్గర పడుతున్న సమయంలో చాలా బారీగా రూ.500,100,50,20 నోట్లు ముద్రించి విడుదల చేయడం మొదలుపెట్టడం గమనిస్తే కేంద్రప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు అర్ధం అవుతోంది. పెద్ద నోట్లు, చిన్న నోట్లు ముద్రణకి కేంద్రప్రభుత్వం ఎంచుకొన్న సమయం, పరిమితులు, బ్యాంకులకి వాటి పంపకం అన్నీ నిశితంగా గమనించినట్లయితే, ప్రతిపక్షాలు, చాలా మంది ఆర్ధికవేత్తలు వాదిస్తున్నట్లుగా అదేమీ అనాలోచితంగా చేసిన పని కాదని అర్ధం అవుతోంది.  

రూ.500,100,50,20 నోట్ల కోసమే దేశంలో సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారంటే దానర్ధం వారికే అవి ఎక్కువ అవసరమని అర్ధం అవుతూనే ఉంది. కనుక మొదట  నల్లకుభేరుల కోసమే రూ.2,000 నోట్లు ముద్రించి అవి వారికి చేరిపోయిన తరువాత, ఇప్పుడు గడువు దగ్గర పడుతున్న సమయంలో సామాన్య ప్రజలు కోసమే ఈ చిన్ననోట్లను ముద్రిస్తున్నట్లుగా భావించవచ్చు. 

నోట్ల రద్దు ప్రకటించిన వెంటంటే నల్లకుభేరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారని ఊహించిన కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, పోష్టాఫీసుల ద్వారానే పెద్ద నోట్లని విడుదల చేసింది. ఊహించినట్లుగానే కొందరు అవినీతిపరులైన  బ్యాంకు అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో  నల్లకుభేరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని కొత్త రూ.2,000 నోట్లలోకి మార్చేసుకొన్నారు. ఇంకా మార్చుకొంటూనే ఉన్నారు కూడా. ఒకవేళ రూ.500,1000 నోట్లు ముద్రించి ఉండి ఉంటే అవన్నీ వారి తిజోరీలలోకే వెళ్ళిపోయుండేవని అర్ధం అవుతూనే ఉంది. కనుక ఆ పెద్ద నోట్లు ప్రత్యేకంగా వారి కోసమే ముద్రించినట్లు భావించవచ్చు. 

ఆ నోట్లే వారిని పట్టి ఇవ్వవచ్చు. కేంద్రప్రభుత్వం తలుచుకొంటే బ్యాంకుల నుంచి ఆ నోట్లు ఎవరెవరికి చేరాయని ఆచూకీ తీయడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. డిశంబర్ 30 తరువాత దేశంలో సామాన్య ప్రజలు కష్టాలు తగ్గుముఖం పడతాయని, అవినీతిపరుల కష్టాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంలో ఉద్దేశ్యం అదే అయ్యుండవచ్చు. ఒకవేళ ఆ విదంగా వారినందరినీ పట్టుకోవడం సాద్యం కాకపోయినట్లయితే, బహుశః వాటిని కూడా ఇలాగే అకస్మాత్తుగా రద్దు చేయడం ద్వారా దేశంలో నల్లధనాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చు. 

ఒకవేళ కేంద్రప్రభుత్వం మళ్ళీ ఈ పెద్ద నోట్ల రద్దు చేసినట్లయితే దాని వలన ఈసారి సామాన్యులు ఎవరూ ఇబ్బందిపడే అవకాశం ఉండదు. ఎందుకంటే వారి వద్ద రూ.500 నోట్లు పుష్కలంగా ఉంటాయి కనుక. ఈ నోట్ల రద్దు తరువాత నల్లకుభేరులు తమ నల్లధనాన్ని కొత్త కరెన్సీలోకి మార్చుకోవడానికి ఎన్ని విధాలుగా మార్చుకోగలరనే విషయంపై ఇప్పుడు కేంద్రప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్, ఆర్ధిక శాఖకు కూడా స్పష్టమైన అవగాహన ఏర్పడింది కనుక ఈసారి ఇంకా పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసి వారి ఆట కట్టించవచ్చు. కానీ ఆలోగా వారు కూడా తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లని మళ్ళీ రూ.500ల నోట్లలోకి మార్చేసుకోకుండా నిలువరించవలసి ఉంటుంది. 


Related Post