విమర్శించారని వెనక్కి తగ్గబోము: కోదండరామ్

December 24, 2016


img

తెలంగాణా జేయేసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ తెరాస సర్కార్ కి ఈరోజు మరోసారి చురకలు వేశారు. అయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ “ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నామని మాపై కొందరు నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. మాకు రాజకీయ ఆలోచనలు లేవు. ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు. ఆ విషయం అందరికీ తెలుసు కానీ మమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశ్యంతో లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నారు. కానీ వారు వాటిని నిరూపించలేకపోతున్నారు. వారు అధికారంలో ఉన్నారు కనుక వారేదో చెపితే మీడియాలో ఒక వర్గం కూడా ఏదేదో వ్రాసి పడేస్తుండటం చాలా విచారకరం. మా గురించి వ్రాసేటప్పుడు మా వివరణ తీసుకొని ఉంటే బాగుండేది. అయినా మాపై ఎదురుదాడి చేస్తున్నారని భయపడి వెనక్కి తగ్గేది లేదు. ప్రజా సమస్యలపై మేము పోరాడుతూనే ఉంటాము,” అని అన్నారు. 

అయన తెరాస ఎంపి బాల్క సుమన్ ఉద్దేశ్యించి అన్నవేనని అర్ధం అవుతూనే ఉంది. ప్రొఫెసర్  కోదండరామ్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మేధావి ముసుగులో తెరాస సర్కార్ పై బురద జల్లుతున్నారని సుమన్ ఆరోపించారు. కొంతమంది తెరాస నేతలు కూడా ప్రొఫెసర్  కోదండరామ్ ని విమర్శిస్తున్నారు. బహుశః వారికి ఆయన ఈవిధంగా జవాబు చెప్పారనుకోవాలి.  అయితే తెరాస సర్కార్ తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసమే చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ప్రొఫెసర్  కోదండరామ్ కూడా అదే కోరుకొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రొఫెసర్  కోదండరామ్ ఇద్దరి లక్ష్యం ఒక్కటే కానీ వారిద్దరి మద్య ఎందువల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఎవరైనా చొరవ తీసుకొని ముఖ్యమంత్రికి, ఆయనకి మద్య రాజీ కుదిర్చితే బాగుంటుందేమో!  


Related Post