బెడిసి కొట్టిన రాహుల్ ఐడియా

December 24, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోగా భూకంపం రాలేదేమిటి అని ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సాక్ష్యంగా ఈరోజు ట్వీట్టర్ లో కాంగ్రెస్ పార్టీ ఆ వివరాలను ఉంచింది.

అయితే ఆ తొందరపాటులో తమ పార్టీకే చెందిన మాజీ డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు కూడా దానిలో ఉందని గమనించకుండా పోస్ట్ చేసేశారు. దానితో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే భాజపాకి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. పైగా ఆమెను కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా ప్రకటించారు. కనుక హడావుడిగా పెట్టిన ఈ మెసేజ్ తో ఆమెకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినట్లయింది. మోడీ లంచం తీసుకొన్నారని రాహుల్ గాంధీ గట్టిగా వాదిస్తున్నారు కనుక, కాంగ్రెస్ పార్టీ స్వయంగా విడుదల చేసిన లంచాలు తీసుకొన్న వారి జాబితాలో షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది కనుక ఆమె కూడా తీసుకొన్నట్లుగానే రాహుల్ గాంధీ స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. రాహుల్ గాంధీ అత్యుత్సాహం ప్రదర్శించి సరిగ్గా ఎన్నికలకు ముందు తమ పార్టీ మీద తనే బురద జల్లుకొన్నట్లయింది. 

అయితే చాలా విచారకరమైన విషయం ఏమిటంటే నీతి నిజాయితీ అంటూ ధర్మపన్నాలు చెప్పే ముఖ్యమంత్రులు అందరి పేర్లు ఆ లంచాల జాబితాలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (భాజపా) రూ.5 కోట్లు, ఛత్తీస్ ఘర్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ (భాజపా) రూ.4 కోట్లు, నరేంద్ర మోడీ రూ.40 కోట్లు సహారా గ్రూప్ నుంచి లంచాలు తీసుకొన్నట్లు ఆ జాబితాలో ఉంది. వారందరిలో అతి తక్కువ లంచం తీసుకొన్న వ్యక్తి షీలా దీక్షితే. ఆమె కేవలం రూ.1 కోటి లంచం తీసుకొన్నారు. 


Related Post