నోట్ల రద్దుతో తెలిసిన గొప్ప విషయం?

December 22, 2016


img

నోట్ల రద్దు నిర్ణయంలో మంచి చెడులు, దాని పర్యవసానాలను ఒకసారి పక్కన పెట్టి చూసినట్లయితే ఒక గొప్ప విషయం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ రెండు నెలలలో దేశంలో ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకొని భారత్ నిలబడగలిగింది!!! అంటే మన దేశ ఆర్ధిక వ్యవస్థ పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఒక్క నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందని కొమ్ములు తిరిగిన ఆర్ధిక నిపుణులు బల్లగుద్ది వాదించారు. ఇదివరకు పెద్ద నోట్లను రద్దు చేసిన ఉత్తర కొరియా, ఘనా, వంటి అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోయి, మళ్ళీ కోలుకోవడానికి వాటికి దశాబ్దాలు పట్టిన కారణంగా మన దేశానికి కూడా వాటి గతే పట్టబోతోందని ఆర్ధిక నిపుణులు, ముఖ్యంగా దేశంలో ప్రతిపక్షాలు బల్లగుద్ది వాదించాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

కానీ వారు ఊహించినట్లుగా దేశం కుప్పకూలిపోలేదు. ప్రతిపక్షాలు ఆశించినట్లుగా సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయలేదు. దేశ ఆర్ధిక వ్యవస్థ బలం నిరూపితమయింది. నోట్ల రద్దు ప్రకటన తరువాత అందరూ మొదట్లో కొంత అయోమయానికి, అనేక ఇబ్బందులకు గురైనా కొన్ని సంస్థలు, వ్యవస్థలు, ప్రజలు కూడా చాలా నష్టపోయినా మళ్ళీ త్వరగానే కోలుకొని నిలబడే ప్రయత్నాలు చేశారు. 

మోడీ చెప్పిన 50 రోజుల వ్యవధి కూడా పూర్తికాక మునుపే దేశంలో అన్ని వ్యవస్థలు నిలద్రోక్కుకొని మళ్ళీ యధాప్రకారం పనిచేయడం మొదలుపెట్టాయి. అంటే మన ఆర్ధిక వ్యవస్థ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో మనమందరం చూడగలిగామన్నమాట. మనమే కాదు... భారత్ వైపే చాలా ఆసక్తిగా చూస్తున్న యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ ఆర్ధిక వ్యవస్థ బలాన్ని అర్ధం చేసుకోగలిగాయి.

మరో గొప్ప శుభ పరిణామం ఏమిటంటే, ఈ ఆర్ధిక సంక్షోభాన్ని భారత్ తట్టుకొని నిలబడటమే కాదు...ఊహించని విధంగా నగదు రహిత లావాదేవీల వైపు అడుగులు వేయడం కూడా మొదలుపెట్టింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అది సాధ్యమేననిపిస్తోంది. 125 కోట్లు మంది ఉన్న జనాభాలో కేవలం 25శాతం మంది దానిని ఆచరించినా భారత ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతం అవడం ఖాయం. . 

అవినీతిపరులు, నల్లకుభేరులు యధాప్రకారం తమ చేతివాటం ప్రదర్శిస్తున్న సమయంలో కూడా భారత్ చాలా దృడంగా నిలబడగలిగింది. అదే...మోడీ చెప్తున్నట్లుగా ఈ అవినీతిపరుల నుంచి నల్లకుభేరుల నుంచి దేశానికి నిజంగానే విముక్తి కల్పించగలిగితే...ప్రపంచ దేశాలను భారత్ శాసించగలుగుతుందేమో? మనకి అంత ఆశ ఏనాడు లేదు. దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించగలిగితే చాలు. అందుకు ఇటువంటి కటిన నిర్ణయాలు తీసుకోవడం..వాటిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా దృడంగా నిలబడి వాటిని అమలు చేయడం చాలా అవసరం. ఆ పని ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నట్లే కనిపిస్తుంది. కనుక ఆయనకి ప్రతిపక్షాలు అండగా నిలబడక పోయినా దేశ ప్రజలు అందరూ అండగా నిలబడటం చాలా అవసరం.


Related Post