కాంగ్రెస్ ప్రభుత్వమే మిషన్ కాకతీయని చేపట్టి ఉంటే..

December 16, 2016


img

రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు శాసనసభలో మిషన్ కాకతీయపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి జవాబు చెపుతూ “తెలంగాణా ఉద్యమ సమయంలోనే చెరువులని పునరుద్దరించుకోవాలని అనుకొన్నాము. అధికారంలోకి రాగానే వెంటనే ఆ పని మొదలుపెట్టాము. రూ.2595 కోట్ల వ్యయంతో మిషన్ కాకతీయ మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశామని దాని వలన ఆ చెరువుల పరిసర ప్రాంతాలలో భూగర్భజలాలు బాగా పెరిగాయని, చెరువుల నుంచి తీసిన సారవంతమైన పూడిక మట్టిని రైతులకి అందించామని చెప్పారు. ప్రస్తుతం రూ. 3150 కోట్లు వ్యయంతో రెండవ దశ పనులు జరుగుతున్నాయని, వచ్చే నెలాఖరు నుంచి మూడవ దశ పనులు మొదలుపెడతామని చెప్పారు. మూడవ దశలో రాష్ట్రంలో 36,000 చెరువులలో పూడిక తీసి బాగు చేస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ పధకం క్రింద బాగు చేస్తున్న చెరువులనన్నిటినీ జియో ట్యాగింగ్ చేసి ఆ వివరాలను వెబ్ సైట్ లో పెడుతున్నామని చెప్పారు. 

ఈ మిషన్ కాకతీయపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అది చాలా మంచి పధకమేనని దాని వలన రైతులకు చాలా మేలు కలుగుతోందని రుజువయింది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. ఒకవేళ అప్పుడే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెరువుల పూడిక తీత పనులు చేపట్టి ఉండి ఉంటే, విద్యుత్ సమస్య ఉన్నప్పటికీ చెరువులు, బావుల నిండా నీళ్ళు ఉండేవి కనుక రైతన్నల పొలాలకి అవసరమైనంత నీళ్ళు అంది ఉండేవి. అప్పుడు విద్యుత్ ఉండేది కాదు ఈవిధంగా చెరువులలో నీళ్ళు ఉండేవి కావు. ఆ కారణంగానే అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అప్పుడే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పూడిక తీసి ఉండి ఉంటే బహుశః కొన్ని వేలమంది రైతన్నల ప్రాణాలు కాపాడబడి ఉండేవేమో? 

ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ ఉంది. చెరువుల నిండా నీళ్ళు కూడా ఉన్నాయి. కనుక నీళ్ళ సమస్య కారణంగా రైతన్నలు ప్రాణాలు తీసుకోవలసిన అవసరమే లేదిప్పుడు. మిషన్ కాకతీయ పూర్తయితే రాష్ట్రంలో రైతులకి నీళ్ళ సమస్య ఇక ఎన్నడూ ఎదుర్కోవలసిన అవసరం ఉండకపోవచ్చు.  


Related Post