నోట్ల కష్టాలు ఎప్పుడు తీరుతాయంటే...

December 14, 2016


img

నోట్ల కష్టాల గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. ఇప్పుడు అవి కూడా రోజువారి వార్తలలో ఒక భాగం అయిపోయాయి. ఈ పాత నోట్ల రద్దు ప్రక్రియ ముగించి, మళ్ళీ దేశంలో సామాన్య పరిస్థితులు తీసుకురావడానికి తన ప్రభుత్వానికి 50 రోజులు సమయం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలని మొదటే అభ్యర్ధించారు. ఆ గడువు ఇంచుమించుగా ఈనెలాఖరుకి పూర్తవుతుంది. దేశంలో పాత నోట్ల చెల్లుబాటు కూడా అప్పటికే ముగుస్తుంది. కనుక డిశంబర్ 31వ తేదీ నుంచి దేశంలో అన్ని బ్యాంకులకి బారీగా కొత్త కరెన్సీ సరఫరా అయ్యే అవకాశాలున్నట్లు భావించవచ్చు. 

దేశంలో అన్ని బ్యాంకులు ఇంకా పాత నోట్లని స్వీకరిస్తున్నందున, ఈ సమయంలో ఉపసంహరించిన పాత నోట్లకి సరిసమానంగా కొత్త నోట్లని ప్రవేశపెట్టినట్లయితే అవి నల్లకుభేరుల చేతుల్లోకి వెళ్ళిపోతాయనే భయంతోనే కేంద్రప్రభుత్వం ప్రజల అవసరాలకి సరిపడా కొత్త కరెన్సీని సరఫరా చేయడంలేదేమోననే అనుమానం కలుగుతోంది. దాని భయాలని నిజమని నిరూపిస్తూ వందల కోట్లు విలువగల కొత్త నోట్లు నల్లకుభేరుల తిజోరీలలోకి తరలి వెళ్ళిపోతుండటం, వారిలో శేఖర్ రెడ్డి వంటి కొందరు పట్టుబడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. బహుశః అందుకే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రప్రభుత్వానికి తెలిసున్నప్పటికీ పరిమితంగానే కరెన్సీని విడుదల చేస్తున్నట్లు భావించవచ్చు. 

ఇదే నిజమనుకొన్నట్లయితే డిశంబర్ 30వ తేదీ వరకు ప్రజలకి నోట్ల కష్టాలు తప్పవని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక ఆ మరుసటి రోజు నుంచే రిజర్వ్ బ్యాంక్ నుంచి దేశంలో అన్ని బ్యాంకులకి బారీగా నగదు సరఫరా మొదలయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. ఈ నోట్ల కష్టాలకి డిశంబర్ 31న ముగింపు పలికి దేశ ప్రజలు సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతోనే బహుశః కేంద్రప్రభుత్వం డిశంబర్ 30ని పాత నోట్లకి గడువుగా ఎంచుకొని ఉండవచ్చు. ఒకవేళ అప్పటికీ ఈ నోట్ల కొరత సమస్యలని తీర్చలేకపోయినట్లయితే అది ప్రభుత్వ వైఫల్యంగానే భావించవలసి ఉంటుంది. కనుక దేశ ప్రజలు అందరూ డిశంబర్ 31 వరకు ఓపిక పట్టక తప్పదు.


Related Post