ప్రతిపక్షాలని తుడిచిపెట్టేసినా ఏమి లాభం?

December 05, 2016


img

బంగారి తెలంగాణా సాధన కోసం తెరాస సర్కార్ రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట రాష్ట్రంలోని ప్రతిపక్షాలని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసి తనకి ఎదురులేకుండా జాగ్రత్త పడింది. అయినా ఎన్నిసార్లు పీకినా కాస్త తడి తగిలితే మళ్ళీ మొలిచే పచ్చగడ్డిలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఏ చిన్న అవకాశం దొరికినా లేచి నిలబడుతూనే ఉంది. పచ్చగడ్డి వంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదనే సంగతి తెరాస కూడా బాగా గుర్తించినట్లే ఉంది అందుకే వచ్చే ఎన్నికలలో ఆ అవశేష కాంగ్రెస్ పార్టీతో తమకి పోటీ ఉంటుందని మంత్రి కేటిఆర్ అంగీకరించేశారు. 

ప్రతిపక్షాలన్నిటినీ తుడిచిపెట్టేశాము కనుక ఇక కేవలం అవశేష కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుందని తెరాస భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే, ఇప్పుడు ప్రతిపక్షాల లేని లోటుని తెలంగాణా జేయేసి, దాని అనుబంధ సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు తీరుస్తున్నారు. వారు ప్రజల తరపున నిలబడి తెరాస సర్కార్ ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై వారు చేస్తున్న పోరాటాలని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి తెరాస సర్కార్ కి ఏర్పడింది. ఎందుకంటే వారందరూ ఏ రాజకీయపార్టీకి చెందినవారు కారు..పైగా అందరూ తెలంగాణా ఉద్యమాలలో చాల కీలక పాత్ర పోషించినవారే. ఆ కారణం చేత వారిని ఎదుర్కోవడం తెరాస సర్కార్ కి కొంచెం కష్టంగానే మారింది. వారిలో ప్రొఫెసర్  కోదండరామ్ పై కాంగ్రెస్ ముద్ర వేసి విమర్శలు,ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది కానీ ఆయన గురించి తెలిసిన తెలంగాణా ప్రజలు వాటిని నమ్మరని తెరాసకి కూడా తెలుసు. కానీ అంతకంటే వేరే మార్గం కనబడటం లేదు. 

ఇప్పుడు ఆయనకి అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క కూడా తోడయ్యారు. ఒకప్పుడు తెలంగాణా సాధన కోసం తమతో భుజం భుజం కలిపి పనిచేసిన తెరాస, అధికారంలోకి వచ్చిన తరువాత తమని పట్టించుకోకపోయినా పరువాలేదు కానీ తమపై ‘ఉపా’ లాంటి చట్టాలను ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిన్న గిరిజన జేయేసి విద్యార్ధి జేయేసి నిర్వహించిన సమావేశంలో విమలక్క మాట్లాడుతూ, “ఈ అక్రమ అరెస్టులని వ్యతిరేకిస్తూ మళ్ళీ మరో ‘తెలంగాణా ధూంధాం’ మొదలుపెట్టబోతున్నాను. రాష్ట్రంలో ప్రజలకి జరుగుతున్న అన్యాయాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం కళ్ళకి కట్టే విధంగా మా ఆటపాటలతో తెలియజేస్తాం. తెరాస సర్కార్ తీరుని చూస్తున్నప్పటికీ కొందరు కవులు, కళాకారుల గొంతులు మూగబోతున్నాయి. వారు దొరల గడీలకి కాపలా కుక్కలుగా ఉండదలచుకొన్నారో లేదా మళ్ళీ ప్రజలకోసం తమ గొంతులు సవరించుకొంటారో వారిష్టం,” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, చెరుకు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో మేధావులు, కవులు, కళాకారులలో ఈవిధంగా వ్యతిరేకిస్తున్నప్పుడు, తెరాస సర్కార్ వారి విమర్శలకి ప్రతివిమర్శలు ఆరోపణలు చేసి బలవంతంగా వాళ్ళ నోళ్ళు మూయించాలనుకోవడం కంటే, వారు లేవనెత్తుతున్న సమస్యల గురించి వారితోనే చర్చించి, వారి సహకారం కూడా పొందితే మంచిది కదా? లేకుంటే వారందరూ ఒక సమైక్యశక్తిగా ఎదిగి వచ్చే ఎన్నికలలో తెరాసకి సవాలు విసిరితే దానికే నష్టం కదా! 


Related Post