జయా టీవీ అత్యుత్సాహం!

December 05, 2016


img

తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీకి ఆధ్వర్యంలో నడుస్తున్న టీవీ ఛానల్ జయా టీవి. సెన్సేషనల్ న్యూస్ కోసం ఆరాటపడే అలవాటులో పొరపాటుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కన్ను మూశారంటూ కొద్ది సేపటి క్రితం ప్రకటించేసింది. అది చూసి సంతాపం సూచనగా అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యాలయం పార్టీ జెండాని సగం వరకు దింపేసింది. అధికార పార్టీ న్యూస్ ఛానల్లోనే ఈ వార్త వచ్చేయడంతో మరికొన్ని ఛానల్స్ ఇంక ఆలస్యం చేయకుండా అవి కూడా జయలలిత మృతి చెందారంటూ వార్తలు ప్రసారం చేసేశాయి. అవి చూసి కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆమె ఆత్మకి శాంతి కలగాలని సంతాప సందేశాలు పెట్టేస్తున్నారు. అప్పుడు అపోలో ఆసుపత్రి మేల్కొని ఆ వార్తలని ఖండిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యమంత్రి జయలలిత లైఫ్ సపోర్టింగ్ యూనిట్ సహాయంతో సజీవంగా ఉన్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితిని డిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్య నిపుణులు నిరంతరం గమనిస్తూ తగిన చికిత్స చేస్తున్నారని, కనుక ఆమె మరణ వార్తలని ప్రసారం చేసిన మీడియా వాటిని సరిదిద్దుకోవాలని కోరింది.

                                                

సంచలన వార్తలని మిగిలిన అన్ని ఛానల్స్ కంటే తామే ముందుగా ప్రజలకి తెలియజేసి తమ ఛానల్ కి గొప్ప పేరు సంపాదించుకోవాలనే తాపత్రయంతో ప్రసారం చేస్తున్న ఇటువంటి వార్తలతో మీడియా తన విశ్వసనీయతని కోల్పోతోంది. దానితోబాటే మానవత్వాన్ని కూడా. జయలలిత క్షేమంగా తిరిగి రావాలని ఆ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఆమె కోసం దేవుళ్ళని ప్రార్దిస్తుంటే, మీడియా మాత్రం ఆమె బ్రతికి ఉండగానే చంపేసింది. మీడియా యొక్క ఈ విపరీత ధోరణిని అందరూ గట్టిగా ఖండించాల్సిందే. ఒకరి చావుని సంచలన వార్తగా భావించడమే నీచం అనుకొంటే, మనిషి బ్రతికి ఉండగానే చంపేయడాన్ని ఏమనుకోవాలి?  



Related Post