కోదండరామ్ ని ఏమైనా అంటే ఊరుకోము

December 03, 2016


img

తెలంగాణా జేయేసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ పై మంత్రి కేటిఆర్ చేసిన తీవ్ర విమర్శలకి ఆయన కంటే ముందుగా కాంగ్రెస్, తెదేపా నేతలు స్పందించడం విశేషం. కేటిఆర్ విమర్శలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ “తెలంగాణా సాధన కోసం మీతో కలిసి పోరాడిన ప్రొఫెసర్  కోదండరామ్ ని మీరు గౌరవించలేకపోతున్నారు. ఆయన ఇప్పుడు ప్రజల తరపున నిలబడి ప్రభుత్వానికి చేస్తున్న సూచనలని మీరు పట్టించుకోవడం లేదు. కానీ ఆయన విమర్శలు చేస్తే మాత్రం మీకు చాలా ఆగ్రహం కలుగుతుంది. ఆయనని మీరు గౌరవించకపోయినా పరువాలేదు కానీ ఈ విధంగా విమర్శిస్తే సహించబోము. అయినా ప్రొఫెసర్  కోదండరామ్ తెలంగాణా ఉద్యమాల కోసం పోరాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అని రేవంత్ రెడ్డి కేటిఆర్ ని ప్రశ్నించారు. 

తెరాస సర్కార్ విమలక్క పట్ల చాలా అగౌరవంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణా సాధన కోసం గళం విప్పి పోరాడిన ఆమెకి మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఆమె కార్యాలయానికి ప్రభుత్వం ఎందుకు తాళం వేసిందో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణా సాధన కోసం పోరాడినవారిని తెరాస సర్కార్ గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కూడా మంత్రి కేటిఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటిఆర్ పదవులతో వచ్చిన అహంకారం చేతనే తన కంటే పెద్దవాడైన ప్రొఫెసర్  కోదండరామ్ ని విమర్శిస్తున్నారని శ్రావణ్ అభిప్రాయ పడ్డారు. ప్రొఫెసర్  కోదండరామ్ భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, వారికి ఇష్టం లేకుండా బలవంతంగా భూములు గుంజుకోవద్దని మాత్రమే చెపుతున్నారని, ఆయన ఏనాడూ ప్రాజెక్టులు కట్టవద్దని అనలేదని శ్రవణ్ అన్నారు. 

కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా తెరాస సర్కార్ ని వ్యతిరేకిస్తుంటాయి కనుక వారు ప్రొఫెసర్  కోదండరామ్ ని సమర్ధిస్తూ మంత్రి కేటిఆర్ పై విమర్శలు గుప్పించడం సహజమే. అలాగే ప్రొఫెసర్  కోదండరామ్ భూనిర్వాసితులకి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరడం కూడా న్యాయమే. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా అధికారంలో లేని వారు ఎన్ని సూత్రాలైనా అలవోకగా వల్లె వేయవచ్చు కానీ వారు చెప్పిన విధంగానే అభివృద్ధి పనులు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. 

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్నిసార్లు కటినమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. వాటి వలన కొందరికి నష్టం అనేకమంది ప్రజలకి మేలు కలుగవచ్చు. ప్రాజెక్టులలో ఉండే ఈ సాధకబాధకాల గురించి ప్రతిపక్షాలకి కూడా తెలుసు. కానీ తెలియనట్లుగా వాదిస్తుంటాయి. 

ప్రాజెక్టుల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నట్లయితే వారు కోర్టులకి వెళ్ళి తమ ప్రభుత్వాన్ని సవాలు చేయవచ్చని స్వయంగా కేటిఆర్ సూచించారు. కనుక నిర్వాసితుల పట్ల ప్రతిపక్షాలకి నిజంగా అంత ప్రేమాభిమానాలు, సానుభూతి ఉన్నట్లయితే తెరాస సర్కార్ పై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేసే బదులు కేటిఆర్ చెప్పినట్లుగా కోర్టులకి వెళ్ళి వారికి న్యాయం కోరవచ్చు కదా? 

ప్రొఫెసర్  కోదండరామ్ ప్రభుత్వానికి అనివార్య పరిస్థితి కల్పించినందునే కేటిఆర్ ఆయనపై విమర్శలు చేశారని చెప్పవచ్చు. ప్రొఫెసర్  కోదండరామ్ తెలంగాణా కోసం పోరాటాలు చేశారు కనుక ఆయన తమ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా భరిస్తూ ఉండిపోవాలని ఆశించడం అత్యసే అవుతుంది. తెరాస సర్కార్ సహనం కూడా నశిస్తోంది గాబట్టే ప్రొఫెసర్  కోదండరామ్ కి జవాబు చెపుతోందని భావించవచ్చు.


Related Post