టి.ఆర్.పి రేటింగ్ పెంచుకోవడానికే మోడీ తిప్పలు?

December 02, 2016


img

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. పార్టీ పార్లమెంట్ సభ్యులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ప్రధాని మోడీ తన స్వీయ ప్రతిష్ట పెంచుకొనేందుకు దేశ ప్రజలని కష్టాల పాలు చేస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ పునాదులని తన ఒక్క నిర్ణయంతో దెబ్బ తీశారు. ఆయన టెలివిజన్ ఛానల్స్ తరహాలో తన టి.ఆర్.పి. రేటింగ్స్ పెంచుకొనేందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఆయనకి దేశ భవిష్యత్, ప్రజల కష్టాల కంటే తన స్వంత ఇమేజే ముఖ్యం. చివరికి ఆయన దానికే బందీ అయిపోయారిప్పుడు,” అని విమర్శించారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తమ కాంగ్రెస్ పార్టీ గొప్పదనం గురించి కూడా చెప్పుకొన్నారు. “మన పార్టీ ఏనాడూ ఎంతో అనుభవజ్ఞులైన పార్లమెంటు సభ్యుల నిర్ణయాన్ని పెడచెవిన పెట్టే ప్రధానిని దేశానికి ఇవ్వలేదు. మన పార్టీ ఏనాడూ తన స్వంత ఇమేజికే బందీ అయిపోయిన ప్రధానిని ఇవ్వలేదు. మన పార్టీ ఏనాడూ దేశ ప్రజలని ఇన్ని కష్టాల పాలు చేసే ప్రధానిని ఇవ్వలేదు. మన పార్టీ ఏనాడూ టి.ఆర్.పి. రేటింగ్స్ కోసం ఆశపడే ప్రధానిని ఇవ్వలేదు. కనీసం ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రజాభిప్రాయాన్ని వినిపిస్తున్న పార్లమెంటు సభ్యుల సలహాలని, సూచనలని ప్రధాని నరేంద్ర మోడీ చెవికెక్కించుకొంటే చాలు. ఈ సమస్యల నుంచి దేశం బయటపడుతుంది,” అని చెప్పారు. 

“నల్లధనం వెలికి తీస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఇంకా పదింతల నల్లధనం పోగయ్యేవిధంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు.ఆయన నల్లధనం ఉన్నవారిని విడిచిపెట్టేసి సామాన్య ప్రజలపై తన ప్రతాపం చూపిస్తున్నారు. ఆయన విదేశీవిధానంలో కూడా ఎటువంటి స్పష్టత లేదు. పాకిస్తాన్ పట్ల వ్యవహరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ. ఆయన అనుసరిస్తున్న విధానాల వలన మళ్ళీ కాశ్మీర్ లో అశాంతి నెలకొంది. ఉగ్రవాదులు నేరుగా ఆర్మీ క్యాంప్ లలోకే చొరబడి మన సైనికులని చంపుతున్నారు. కానీ ఆయన నిమ్మకి నీరెత్తినట్లు చూస్తూ కూర్చోంటున్నారు. కనీసం పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పడం లేదు. ఇటువంటి ప్రధాన మంత్రిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇక ముందు చూడబోమే కూడా,” అని రాహుల్ గాంధీ విమర్శించారు.


Related Post