మోడీ రహిత భారత్ చేస్తా!

November 28, 2016


img

ఈ మద్యన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. నోట్ల రద్దు సమస్యపై దేశంలో మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీల నేతల కంటే ఆమె కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈవిషయంలో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. 

సోమవారం కోల్ కతాలో జరిగిన ఒక ‘జన్ ఆక్రోశ్’ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ “దేశంలో పేద ప్రజలని అష్టకష్టాలు పాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వం ఇంకా సాగదు. ఆయనకి సామాన్య ప్రజలపై ఏమాత్రం అభిమానం ఉన్నా తక్షణమే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. పేద ప్రజలని ఇన్ని కష్టాల పాలు చేస్తున్న మోడీని ఈ దేశ రాజకీయాలలో నుంచి తరిమికొడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పోరాటంలో నేను చచ్చినా, బ్రతికినా పరువాలేదు,” అని శపథం చేశారు. 

మోడీ ‘కాంగ్రెస్ రహిత భారత్’ అని నినదిస్తుంటే, మమతా బెనర్జీ ‘మోడీ రహిత భారత్’ అనే కొత్త నినాదం చేశారు. బహుశః దానితో ఆమె దేశంలో మోడీ వ్యతిరేక వర్గాలని, శక్తులని, రాజకీయ పార్టీలని ఆకట్టుకొని వాటికి నాయకత్వం వహించాలని కలలు కంటున్నట్లున్నారు. అయితే ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డ్డీ కొనడం అంత సులవైన పనేమీ కాదు. అందుకు ఆయన వ్యతిరేకులు అందరినీ ఒక్క త్రాటిపైకి తేగల నేర్పు, ఓర్పు చాలా అవసరం. 

మోడీ వ్యతిరేకులాని ఒకచోట చేర్చడం అంటే కేవలం ఆయనని ఓడించడమే కాదు ఆయన నిర్వహిస్తున్న ప్రధాని పదవికి పోటీ పడటంగా అని కూడా చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీ ఆ పదవిపై కన్నేసినట్లున్నారు. కానీ మోడీ వ్యతిరేకులలో కనీసం ఒక డజను మంది ఆ పదవి కన్నేసి ఉన్నారు. కనుక వారందరినీ ఆమె కూడగట్టగలిగినా ప్రధాని పదవి విషయంలో వారి మద్య పోటీని ఆమె అడ్డుకోలేరు కనుక వారినందరినీ ఎక్కువ కాలం కలిపి ఉంచడం కూడా అసంభవమే. కనుక ప్రతిపక్షాలలో ఈ అనైఖ్యత ఉన్నంత కాలం మమతా బెనర్జీ కల, ప్రతిజ్ఞ రెండూ కూడా నెరవేరే అవకాశమే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.    



Related Post