తూచ్ బంద్ కాదు నిరసన మాత్రమే!

November 27, 2016


img

నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కాంగ్రెస్, వామపక్షాలు, వాటి మిత్రపక్షాలు భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి. కానీ మళ్ళీ మాట మార్చి తాము బంద్ కి పిలుపునివ్వలేదని, కేవలం నిరసనలు తెలియజేయమని మాత్రమే పిలుపునిచ్చామని చెప్పుకొంటున్నాయి. తాము బంద్ కి పిలుపునిచ్చినట్లు, అది విఫలం అయినట్లు భాజపా నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ ఆరోపించారు. 

మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన సామాన్యులే తప్ప నల్లధనం ఉన్నవారెవారూ ఇబ్బందిపడటం లేదని అన్నారు. తాము సామాన్య ప్రజల కష్టాలు మోడీ ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఆక్రోస్ దివస్ పేరిట సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాము తప్ప ఎక్కడా బంద్ పాటించడం లేదని అన్నారు.

 సిపిఐ నేత సురవరం కూడా ఇంచుమించు అదేవిదంగా మాట్లాడారు. విజయ్ మాల్యా వంటివారు వేలకోట్లు దోచుకుపోయిన వారిని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేక తమ ప్రతాపం సామాన్య ప్రజలపై చూపిస్తోందని అన్నారు. పెద్ద నోట్లని రద్దు చేసి అంతకంటే పెద్ద నోటుని ఎందుకు, ఎవరి కోసం ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. మోడీ తీసుకొన్న నిర్ణయంతో విదేశాలలో ఉన్న నల్లధనం బయటకి రప్పించడం ఏవిధంగా సాధ్యం? అని ప్రశ్నించారు. 

వారి ప్రశ్నలకి ప్రధాని నరేంద్ర మోడీయే జవాబు చెప్పవలసి ఉంటుంది. కనుక వాటిని పక్కనబెట్టి వారు భారత్ బంద్ గురించి చేసిన ఆరోపణల గురించి ఆలోచించినట్లయితే, వారు కూడా మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి భయపడుతున్నారని అర్ధం అవుతోంది.  “అసలు నోట్ల రద్దు నిర్ణయాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు ప్రజల తరపున నిలబడతారా లేదా నల్లధనం పోగేసుకొన్న వారి తరపున నిలబడుతారా? నల్లధనం వెలికితీయడానికి మీకు అభ్యంతరం లేనట్లయితే మరి ఎందుకు బంద్ చేస్తున్నారు?” అని ప్రశ్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి వారివద్ద జవాబులు లేవు. నోట్ల రద్దుని వ్యతిరేకించడం అంటే నల్లధనం వెలికి తీసే ప్రయత్నాలని అడ్డుకొంటున్నట్లే అనే భావన ప్రజలలో నెలకొని ఉన్నందున ప్రతిపక్షాలు తమ బంద్ ని బంద్ అని చెప్పుకోవడానికి కూడా భయపడవలసి వస్తోందని చెప్పవచ్చు. ఈ సమస్యపై బంద్ నిర్వహించినట్లయితే ప్రజాగ్రహానికి గురి కావలసి వస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు భయపడుతున్నట్లు అర్ధం అవుతుంది. అందుకే తమది బంద్ కాదని కేవలం నిరసనలు మాత్రమే అని చెప్పుకొంటున్నారు.

కానీ వారు తమ అందోళనలకి ఏ పేరు పెట్టుకొన్నా, వారు నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టం అయ్యింది. ఈ నిర్ణయం వలన నల్లధనం దాచుకోన్నవారు ఇబ్బందులు పడటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు అర్ధరహితమే. ఎందుకంటే, ఈ నిర్ణయం ప్రకటించిన రోజు నుంచి వాళ్ళు తమ వద్ద ఉన్న ఆ నల్లధనం మార్చుకోవడానికి అనేక పాట్లు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. గడువు సమీపిస్తున్న కొద్దీ వారు ఇంకా తొందరపడటం అందరూ తప్పక చూస్తారు. అప్పుడు ప్రతిపక్షాలు కూడా వారికి నష్టం కలగకుండా ఆడ్డుపడాలని విశ్వప్రయత్నాలు చేయవచ్చు. 



Related Post