పవన్ వెర్సస్ జగన్: ప్రత్యేక ఫైట్!

November 05, 2016


img

ఏపిలో జనసేనాని పవన్ కళ్యాణ్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మద్య ప్రత్యేక పోరాటం జరుగుతోంది. అంటే వారిద్దరూ పోరాడుకొంటున్నారని కాదు వారిద్దరూ ఏపికి ప్రత్యేక హోదా సాధించిపెడదామని పోరాడుతున్నారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే అయినప్పటికీ ఎవరి పోరాటాలు వారివే. 

జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో దాని కోసం బహిరంగ సభ నిర్వహించబోతుంటే, పవన్ కళ్యాణ్ ఈనెల 10వ తేదీన అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. “ఆవు..పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి” అన్నట్లుగా వారి మద్యలో మరొక నేత కూడా ఎంట్రీ ఇచ్చాడు. అతను కొణతాల రామకృష్ణ. ఆయన రెండేళ్ళ క్రితం వైకాపాలోనే ఉండేవాడు. కానీ జగన్ తో పడక బయటకి వచ్చేశాడు. ఆయన కూడా ఇప్పుడు ప్రత్యేక జెండా పట్టుకొని పోరాటాలు మొదలుపెడుతున్నారు.

కానీ పోటీ ప్రధానంగా పవన్, జగన్ మధ్యనే ఉంటుందని వేరేగా చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ కంటే జగన్ కే ఎక్కువ క్లారిటీ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనితో ఏదోవిధంగా ఆంధ్రా ప్రజలని రెచ్చగొట్టి తన ఉద్యమాలని ఉదృతం చేయాలని జగన్ చాలా గట్టిగానే యువభేరీలు మ్రోగిస్తున్నారు కానీ ఆయన ప్రదర్శిస్తున్నంత ఆవేశం జనాలు చూపించడం లేదు. 

గమ్మతైన విషయం ఏమిటంటే, జగన్ ఎంత రెచ్చగొడుతున్నా ముందుకు రాని జనాలు పవన్ కళ్యాణ్ కనుసైగ చేస్తే చాలు ఉద్యామాలు చేసేద్దామని చాలా ఆత్రపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తను కన్ఫ్యూజ్ అవుతూ తన అభిమానులని కూడా చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. “మనం రోడ్లెక్కి నిరసనలు చేయొద్దు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొందాము. మన ఎంపిలనే ప్రత్యేక హోదా సాధించిపెట్టమని అడుగుదాము..వాళ్ళు తమ వల్ల కాదని చెపితే అప్పుడు మనం ఇస్టార్ట్ చేద్దాము” అని వాళ్ళని వెనక్కి లాగుతున్నాడు. 

ఇప్పుడు వీరిద్దరి స్పెషల్ ఫైట్స్ పై రివ్యూ వేసుకొని చూస్తే, జగన్ తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని దీనితో దెబ్బతీసి వచ్చే ఎన్నికలలో గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోదామనే డ్రీం ప్రాజెక్టుతోనే ఈ స్పెషల్ ఫైట్స్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే దీనికోసం ఆయన ఆయన ఫుల్ టైం స్పేర్ చేస్తున్నాడు. 

కానీ పవన్ కళ్యాణ్ కనీసం పార్టీని ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు కూడా కనిపించడు. తన పార్టీకి “అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే” అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించుకొన్నాడు కనుక అధికారం కోసమే ఈ స్పెషల్ ఫైట్స్ లో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నట్లు అనుకోలేము. పోని ప్రత్యేకహోదా కోసమైనా సీరియస్ గా ఫైట్ చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆయన దృష్టి అంతా కాటమరాయుడుపైనే ఉంటుంది. షాట్స్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు హీరోయిన్లు ట్వీట్స్ పెట్టి అభిమానులకి సంతోషపెడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో గ్యాప్ వచ్చినప్పుడు ఈ ప్రత్యేక సభలు పెట్టి అభిమానులని సంతోషపెడుతున్నట్లుంటుంది. 

ప్రత్యేకహోదా సాధించాలనే కోరిక లేదు. అధికారం వద్దని అనుకొంటున్నప్పుడు మరి సభలు పెట్టి ఈ హిస్టరీ పాఠాలు, కవిత్వం వినిపించుడు ఎందుకు? అనే అనుమానం కలుగుతుంది. ఆయన సభలు పెట్టి బిజెపి నేతలని, కేంద్రప్రభుత్వాన్ని మాత్రమే తిడుతున్నారు కనుక బహుశః బిజెపిని అదుపులో ఉంచేందుకు చంద్రబాబే పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తున్నారేమో? అని అనుమానించవలసి వస్తుంది. కానీ చంద్రబాబుని నమ్ముకొని పవన్ కళ్యాణ్ ముందుకు వెళితే ఏదో ఒకరోజు ఆయన కూడా సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు. కనుక పూర్తి క్లారిటీతో అడుగు ముందుకు వేయడం చాలా మంచిది.     



Related Post