తూచ్! తండ్రి కాదు..కొడుకే ముద్దు!

November 04, 2016


img

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైన తన కొడుకే వారసుడుగా ఉండాలని కోరుకొంటాడు. కానీ యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తన తమ్ముడు శివపాల్ యాదవ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ్ముడు కోసం స్వంత కొడుకు అఖిలేష్ రాజకీయ జీవితంతో చెలగాటం ఆడుతున్నారు కూడా. అందుకే అఖిలేష్ రేపు లక్నోలో జరుగబోయే పార్టీ రజతోత్సవాలలో పాల్గొనకుండా ఒక రధం సిద్దం చేసుకొని వికాస్ యాత్రలకి బయలుదేరిపోయారు. తమ మధ్య ఏమీ విభేదాలు లేవని జనాలని మభ్యపెట్టేందుకు ములాయం స్వయంగా కొడుకు యాత్రకి జెండా ఊపి సాగనంపారు కానీ అక్కడే ఇరువురి మద్దతుదారులు రక్తం కారేలా కొట్టుకొన్నారు. వారిని అక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

ఈ నేపధ్యంలో యూపి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని “గెలిపించే కాంట్రాక్ట్” తీసుకొన్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ములాయం వారిని కలవడంతో, ఆయనతో కాంగ్రెస్ పార్టీ దోస్తీకి సిద్దం అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ తరపున రాయబారానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ చెప్పింది అది కాదుట! ములాయం సింగ్ తన కొడుకుని కూడా కలుపుకొనిపోదలిస్తేనే, కాంగ్రెస్ పార్టీ వారితో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి సిద్దంగా ఉందని, ములాయం నేతృత్వంలో సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగా సాగాలనుకొంటే తాము దూరంగా ఉంటామని చెప్పారు.

అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీకి ఫ్రెండ్లీ సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నారు. వాటిని రాహుల్ గాంధీ బాగానే క్యాచ్ చేసినట్లున్నారు. ములాయం మళ్ళీ కొడుకుని దగ్గరకి తీసుకొన్నట్లయితే, ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ చూస్తూ ఊరుకోడు. ఆయన పార్టీని చీల్చేస్తాడు. కనుక ఒక ఒరలో రెండు కత్తులే ఇమడలేనప్పుడు మూడు కత్తులు ఎలాగ ఇముడుతాయో చూడాలి. ఒకవేళ తండ్రికొడుకులు ఎవరి సైకిల్ వారు నడుపుకోదలిస్తే, అప్పుడు రాహుల్ గాంధీ అకిలేష్ సైకిలే ఎక్కడానికి ఇష్టపడతారేమో. ఎందుకంటే ఇద్దరూ యువకులే కదా. కానీ వాళ్ళు కలిసి సాగాలనుకొంటే ముసలావిడ... అదే షీలా దీక్షిత్ ని వదిలించుకోక తప్పదు. ఆవిడకి ముఖ్యమంత్రి పదవి ఆశ చూపించి తీసుకువచ్చి ఇప్పుడు మద్యలో వదిలించుకొంటే ఆవిడ కూడా భాజపాలో చేరిపోతారేమో?      


Related Post