ఓడిపోతున్నట్లు నటిద్దాం: ట్రంప్

November 03, 2016


img

అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ విజయావకాశాలు అనూహ్యంగా పెరగడంతో, ఇప్పుడు ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. చాలా కేలమైన ఈ సమయంలో హిల్లరీ క్లింటన్ కంటే ట్రంప్ సుమారు 4 శాతం ఓట్లు ఆధిక్యతతో ఉన్నారు. అది ఇంకా పెరుగుతుందా తరుగుతుందా అనేది ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు. హిల్లరీ విజయవకాశాలని తారుమారు చేస్తున్నది ఆమె ప్రైవేట్ ఈ-మెయిల్స్ వ్యవహారమే.

హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ ఈ-మెయిల్స్ ఉపయోగించడం గురించి మొదట జరిగిన బహిరంగ సభలలో ట్రంప్ గట్టిగా విమర్శలు చేసేవారు. కానీ వారిరువురి రెండవ రౌండ్ ముఖాముఖి చర్చలో ట్రంప్ మళ్ళీ ఆ ప్రస్తావన చేసి ఆమెని దెబ్బ తీయాలని ప్రయత్నించినప్పుడు, “నేను ఆవిధంగా చేయడం తప్పే” అని హిల్లరీ క్లింటన్ ఒప్పుకోవడం ద్వారా దానిపై ట్రంప్ ఇక మాట్లాడే అవకాశం లేకుండా చేయగలిగారు. వారి మద్య జరిగిన మూడవ రౌండ్ ముఖాముఖి చర్చలో ఆ విషయం తేటతెల్లమయింది. 

ఇక ఆ వ్యవహారంపై ట్రంప్ తనపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు కూడా పట్టించుకోరని హిల్లరీ వర్గం భావిస్తున్న సమయంలో ఆమె ప్రైవేట్ ఈ-మెయిల్స్ పై ఎఫ్.బి.ఐ. విచారణ చేపట్టడంతో ఆమె విజయావకాశాలు తారుమారవుతున్నాయి. వికీలీక్స్ ద్వారా హిల్లరీ ప్రైవేట్ ఈ-మెయిల్స్ తీగని రష్యా కదిపితే, ఎఫ్.బి.ఐ. డొంక కదిలిందని తద్వారా  ఆయన విజయావకాశాలు మెరుగుపడ్డాయనే వాదన ఒకటి వినిపిస్తోంది.

మిగిలిన ఈ నాలుగైదు రోజులలో వారిరువురిలో ఎవరు ఎక్కువమంది ప్రజలని తమవైపు తిప్పుకోగాలరనే దానిపైనే వారి విజయం నిర్ణయం అవుతుంది. ఒహియో, ఫ్లోరిడా రాష్ట్రాలు వారి విజయావకాశాలని నిర్దేశించబోతుండటంతో ఇద్దరూ ఆ రెండు రాష్ట్రాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలని తమవైపు తిప్పుకొనేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడటంతో మళ్ళీ ఆయనలో పూర్వపు తెంపరితనం, అహంభావం కనిపిస్తున్నాయి. ఆయన నిన్న ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తన అభిమానులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనమే విజయం సాధించబోతున్నాం. కానీ ఓడిపోతున్నట్లు నటిద్దాం. తద్వారా ఈ ఎన్నికలలో మనమే గెలిచి తీరాలనే పట్టుదల ఇంకా పెరుగుతుంది,” అని అన్నారు. ఆయన సానుకూల దృక్పధంతోనే ఆవిధంగా మాట్లాడినప్పటికీ, ఆవిధంగా మాట్లాడటం ఆయనలో గెలుపుపై ధీమా పెరిగినందునే అని చెప్పవచ్చు. అటువంటి మాటలు, ధీమాయే గతంలో తనకి చాలా నష్టం కలిగించిన విషయం ట్రంప్ మరిచిపోయినట్లున్నారు. కారణాలు ఏవైతేనేమి, ఇప్పుడు ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి కనుక ఈ నాలుగు రోజులు ఆయన కాస్త తన నోటిని అదుపు చేసుకోగలిగితే ఆయనకే మంచిది. లేకుంటే తన నోరే తన శత్రువుగా మారి చేతికి అందివచ్చిన ఒక అపూర్వమైన అవకాశాన్ని జారవిడుచుకోవలసి వస్తుంది. 


Related Post