ఏమిటిది దిగ్గీ...వెరీ బ్యాడ్!

November 01, 2016


img


మన దేశంలో కొంతమంది రాజకీయ నేతలు రాజకీయ లబ్ది కలుగుతుందంటే ఉగ్రవాదులనైనా వెనకేసుకు వస్తారు. వేర్పాటువాదులతో రాసుకుపూసుకు తిరగడానికి సిద్దపడతారు. చివరిని నయీం వంటి గూండాలతో చేతులు కలపడానికి చేతులు వెనుకాడరు.

 ఒక ఉగ్రవాది ముస్లిం మతానికి చెందినవాడైతే అతని తరపున వాదించడానికి అసదుద్దీన్ ఒవైసి ఎప్పుడూ ముందుంటాడు. అతని వెనుకే దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు కూడా ఉంటారు. ఒక మావోయిస్ట్ చనిపోతే వరవరరావు, కళ్యాణ్ రావు ఉంటారు. ఒక దళిత విద్యార్ధి చనిపోతే, దేశంలో రాజకీయ పార్టీల నేతలందరూ కాకుల్లా అక్కడ వాలిపోయి కావుకావుమని అరుస్తారు. వారి గోల అతను చనిపోయాడని కాదు. ‘అతని కోసం మేము అరుస్తున్నాము కనుక జనాలు కాస్త మమ్మల్ని గుర్తుంచుకోండి’ అని చెప్పడం వారి ఉద్దేశ్యం. కానీ ఒక పోలీస్ లేదా సైనికుడు చనిపోతే అతని కుటుంబానికి సానుభూతి తెలిపేవారుండరు. ఇవన్నీ వినడానికి చాలా చేదుగా ఉన్నప్పటికీ కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలని అందరికీ తెలుసు. 

భోపాల్ జైలు నుంచి తప్పించుకొని పోయిన 8మంది సిమీ ఉగ్రవాదులని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై కూడా మజ్లీస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ ఆ ఉగ్రవాదుల చేతిలో అతికిరాతకంగా హత్య చేయబడిన పోలీస్ కానిస్టేబుల్ రామ్ శంకర్ గురించి వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే అతని కోసం ఎంత గట్టిగా మాట్లాడినా ఓట్లు రాలవు. అదే..చనిపోయిన ఉగ్రవాదులు అందరూ ముస్లింలు కనుక వారి పక్షాన్న గట్టిగా ధైర్యంగా మాట్లాడితే దేశంలో ముస్లింల కోసం పోరాడేది తాము మాత్రమేనని గట్టిగా చాటి చెప్పుకొన్నట్లవుతుంది. కనుక దేశంలో ముస్లింలు అందరూ కళ్ళు మూసుకొని గుడ్డిగా తమ పార్టీలకే ఓట్లు వేసేస్తారనే అత్యాశ, దురాలోచనే అందుకు కారణం అని చెప్పవచ్చు. 

ఈ విషయంలో అసదుద్దీన్ కంటే దిగ్విజయ్ సింగ్ మరో అడుగు ముందుకు వేసి చాలా అసందర్భమైన ప్రశ్నలు వేయడం గమనిస్తే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా? అని అనుకోకుండా ఉండలేము. 

ఆయన ఏమన్నారంటే, ‘జైలు నుంచి కేవలం ముస్లింలు మాత్రమే తప్పించుకొని పారిపోతారా? హిందూ ఖైదీలు ఎప్పుడూ పారిపోరా?” అని ప్రశ్నించారు. మళ్ళీ అంతలోనే “సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించినా శివరాజ్ సింగ్ యాదవ్ ప్రభుత్వం పట్టించుకోలేదని” అన్నారు. 

ఆయన మొదట చెప్పిన మాట ప్రకారం చూస్తే పోలీసులే ఆ ఉగ్రవాదులని బలవంతంగా బయటకి పంపించి ఎన్కౌంటర్ చేశారన్నట్లుంది. కేవలం ముస్లిం ఖైదీలే జైలు నుంచి పారిపోతారా? అని ప్రశ్నించిన నోటితోనే మళ్ళీ ‘వాళ్ళు జైలు నుంచి పారిపోయే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయని’ చెపుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది. కానీ ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదుల కోసం పోరాడుతున్నారు. ప్రజలని ఆకర్షించి ఓట్లు సంపాదించుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ కరడుగట్టిన ఉగ్రవాదులని కూడా వెనకేసుకు వచ్చేంత నీచానికి దిగజారిపోవాలా? కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో నేటికీ గ్రహించకుండా ఈవిధంగా శవరాజకీయాలు చేస్తుంటే, ఆ పార్టీని దేశ ప్రజలు శాస్వితంగా పక్కన పెడతారని గ్రహిస్తే మంచిది.   



Related Post