రాష్ట్రంలో సమీకరణాలు మారనున్నాయా?

November 01, 2016


img

రాష్ట్రంలో ప్రస్తుతం తెరాసకి తిరుగులేదు. సర్వేలు కూడా అవే సూచిస్తున్నాయి. రాజకీయ పునరేకీకరణ...అదే పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించి రాష్ట్రంలోని ప్రతిపక్షాలని తెరాస చాలా దెబ్బ తీసింది. ఆ దెబ్బకి మళ్ళీ అవి ఇక ఎన్నటికీ కోలుకోలేవని భావించింది. కానీ దాని అంచనాలని తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవడమే కాకుండా తెరాసకి సవాళ్ళు విసురుతోంది కూడా. ఇక తెదేపా రాష్ట్రంలో వన్-మ్యాన్ ఆర్మీగా మిగిలిపోయింది. తెదేపా అంటే రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఉంది. కనుక ఆయన ఒక్కరే బలంగా ఉన్న తెరాసని డ్డీ కొని తెదేపాని గట్టెకించగలరని ఆశించడం కష్టమే. బహుశః అందుకే ఆయన సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో చేస్తున్న పాదయాత్రతో కలిసి సాగారా? అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన యాత్రకి సంఘీభావం తెలిపింది. కనుక ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో అవకాశం ఉంటే వామపక్షాలతో పొత్తులకి ప్రయత్నించవచ్చు. అయితే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమ వాదనలతో, తెరాస సర్కార్ పై చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో  ప్రజలని ఆకట్టుకోగలుగుతున్నప్పటికీ, అవి వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లని రాబట్టుకోగలవా అంటే అనుమానమే. ఎందుకంటే సాక్షాత్ కేంద్రప్రభుత్వమే తెలంగాణా సర్కార్ పాలన అద్భుతంగా సాగుతోందని మెచ్చుకొంటున్నప్పుడు, ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్ముతారా?     

ఇక భాజపా తీరు చాలా అనుమానాస్పదంగానే ఉందని చెప్పక తప్పదు. ఆ పార్టీ రాష్ట్ర నేతలు తెరాసపై విమర్శలు గుప్పిస్తుంటే, కేంద్రప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తెరాస సర్కార్ కి నెంబర్: 1ర్యాంకులు ప్రధానం చేస్తోంది. తెరాస సర్కార్ నిజంగానే అభివృద్ధి సాధిస్తున్న కారణంగానే ఆ ర్యాంకులు ఇచ్చి ఉండవచ్చు. కానీ ఒకవేళ భాజపా నిజంగా తెరాసని వ్యతిరేకిస్తున్నట్లయితే, తెరాసకి మేలుచేకూరే విధంగా వ్యవహరించదు. ఉదాహరణకు అది డిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఏవిధంగా వ్యవహరిస్తోందో చూస్తే అర్ధం అవుతుంది. కనుక అది తెరాసని మంచి చేసుకొని వచ్చే ఎన్నికలలో దానితో జత కట్టే ఆలోచనలో ఉన్నట్లే భావించవచ్చు. 

రాష్ట్ర భాజపా నేతలు తమపై విమర్శలు చేస్తున్నప్పటికీ తెరాస వాటిపై స్పందించకపోవడం గమనిస్తే, తెరాస కూడా భాజపాతో పొత్తులు పెట్టుకొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లే భావించవచ్చు. ఒకవేళ తెరాస-భాజపాలు వచ్చే ఎన్నికలలో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, అప్పుడు కాంగ్రెస్, తెదేపా, వామ పక్షాలు అన్నీ కలిసి పోటీ చేసినా వాటిని ఓడించలేవని ఖచ్చితంగా చెప్పవచ్చు.          



Related Post