శభాష్ మోడీజీ!

October 31, 2016


img

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతీ ఏటా దీపావళి పండుగ రోజున దేశ సరిహద్దులలో సైనికుల వద్దకి వెళ్ళి వారికి స్వయంగా స్వీట్లు పంచి వారితో కలిసి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా చేస్తున్నారు. మొదటి సంవత్సరం పంజాబ్ లోని పాక్ సరిహద్దులలో సైనికులతో దీపావళి జరుపుకొన్న ప్రధాని నరేంద్ర మోడీ నిన్నహిమాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దులలో పహారా కాస్తున్న సైనికులతో కలిసి పండుగ జరుపుకొన్నారు.

దేశంలో ప్రజలందరూ పండుగ సంబరాలలో మునిగితేలుతుంటే, సరిహద్దుల వద్ద సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుతున్నారు. కనుక సాక్షాత్ ప్రధాన మంత్రి వారి వద్దకి వెళ్ళి, వారితో ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడటం, వారి ధైర్య సాహాసాహలని, త్యాగాలని మెచ్చుకోవడం, వారికి స్వయంగా తన చేతులతో స్వీట్లు పంచిపెట్టడం వారికీ చాలా సంతోషం కలిగిస్తుంది. తాము సరిహద్దులలో ఉన్న తమని ప్రభుత్వం గమనిస్తోందని, తమ సేవలని, త్యాగాలని గుర్తిస్తోందనే భావన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇంతకు ముందు దేశ ప్రధానులుగా చేసిన వారిలో ఒకరిద్దరు మాత్రమే ఏదో సందర్భంలో సరిహద్దుల వద్ద పహారా కాస్తున్న సైనికులని కలిసేవారు. అది కూడా చాలా యాంత్రికంగా, సాగేది కనుక సైనికులకి వారి మొక్కుబడి పర్యటనల పట్ల పెద్దగా ఉత్సాహం చూపేవారు కాదు. కానీ మోడీ మనస్పూర్తిగా మాట్లాడే ఆ నాలుగు ముక్కలు వినేందుకు సైనికులు ఎప్పుడూ ఉత్సాహం చూపుతుంటారు. ఆయన స్వయంగా సరిహద్దు ప్రాంతాలలో పర్యటించడం ద్వారా చైనా, పాకిస్తాన్ దేశాలకి కూడా గట్టి సంకేతాలే పంపుతున్నట్లు చెప్పవచ్చు. తన సైనికుల కోసం స్వయంగా ప్రధాన మంత్రి సరిహద్దుల వరకు అవసరమైతే సియాచిన్ పర్వతాలపైకైనా వెళ్తానని, వారికి తన ప్రభుత్వం అన్ని విధాలా అండదండలు అందిస్తుందని స్పష్టం చేసినట్లు అవుతుంది. 


Related Post