తెరాస సర్కార్ కి అది పరీక్షే!

October 29, 2016


img

“తెలంగాణాలో తెరాసకి ఎదురే ఉండకూడదు...రాష్ట్రంలో తెరాసయే శాస్వితంగా అధికారంలో కొనసాగాలి...ప్రతిపక్షాలు ఉండొద్దు,” అనే అసంబద్దమైన ఆలోచనలు చేసినందుకు తెరాస సర్కార్ ఇప్పుడు ఆకులు పట్టుకొనే పరిస్థితి ఏర్పడింది. 

తెరాస చేర్చుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకొంటారో నవంబర్ 8లోగా తెలియజేయవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకోవడంతో దానికి ఏవిధంగా సమాధానం చెప్పాలా? అని తెరాస సర్కార్ చేతులు పిసుక్కొంటూ ఆలోచిస్తోంది.

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వ్యవహారంలో తల బొప్పి కట్టి ఉన్న మంత్రి హరీష్ రావు మెడకే ఇది కూడా చుట్టుకొంది. ఆయన శాసనసభ వ్యవహారాల శాఖకి కూడా మంత్రి కావడమే అందుకు కారణం. ఆయన రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణా రెడ్డితో నిన్న సమావేశమయ్యి ఈ సమస్య గురించి చర్చించారు. వారి ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. 

1.రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పరిధిలో ఉన్న ఇటువంటి వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టుకి తెలియజేయడం. 

2.సుప్రీంకోర్టు కేవలం సలహా మాత్రమే ఇచ్చినట్లుగా భావిస్తున్నట్లయితే, దానిని పరిశీలిస్తున్నామని చెప్పి తమ నిర్ణయం తెలపడానికి మరింత సమయం కోరడం. 

3.వారిపై చర్యలు తీసుకోవడానికి నిర్దిష్టమైన గడువు ప్రకటించడం. 

ప్రభుత్వానికి ఎదురైనా ఈ సమస్యపై న్యాయనిపుణుల సలహా సంప్రదింపులు చేసి తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రి హరీష్ రావు నిర్ణయించారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదనుకొంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరితే మాత్రం తెరాస సర్కార్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదుర్కోవలసి రావచ్చు. 

ప్రత్యర్ధి పార్టీల నేతలని, ప్రజా ప్రతినిధులని అధికార పార్టీలలో చేర్చుకోవడం ఈ దేశంలో కొత్త విషయమేమీ కాదు. కానీ అలాగ చేరినవారి చేత వారి పార్టీల ద్వారా సంపాదించుకొన్న ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ పదవులకి రాజీనామాలు చేయించి చేర్చుకొంటే ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ నిత్యం ప్రతిపక్షాలని దుమ్మెత్తిపోస్తూ, వాటి హయాంలో జరిగిన అవినీతి, అసమర్ధ పాలన వలననే రాష్ట్రం నేడు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటోందని విమర్శలు చేస్తూ, మళ్ళీ ఆ అసమర్ధులు, అవినీతిపరులనే తెరాసలో చేర్చుకొని వారికే మంత్రిపదవులు ఇవ్వడమే విచిత్రం. ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా ఇతర మంత్రులు తమ ప్రత్యర్ధ పార్టీలని విమర్శిస్తున్నప్పుడు, తమ పక్కన నిలబడిన నేతలు, ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీల నుంచే వచ్చారని, నేటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారనే సంగతి కూడా మరిచిపోయినట్లు మాట్లాడుతుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకోవడంతో వారినందరినీ కాపాడుకోవలసిన బాధ్యత తెరాస సర్కార్ నెత్తినే పడింది. అందుకే ఇల్లలకగానే పండుగ కాదంటారు పెద్దలు.


Related Post