ఆ విషయంలో టాటా తొందరపడిందా?

October 29, 2016


img

టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించడం చాలా సంచలన నిర్ణయమే కావచ్చు కానీ దాని వలన, దాని తనంతర పరిణామాల వలన టాటా పరువు, మార్కెట్ విలువ వేగంగా హరించుకుపోతోంది. మిస్త్రీ వలన టాటా సంస్థకి చాల నష్టాలు వచ్చి ఉండవచ్చు..దాని విలువలకి భంగం కలిగించి ఉండవచ్చు లేదా దాని సామాజిక సేవా కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడి ఉండవచ్చు. కానీ ప్రపంచ ప్రసిద్ది చెందిన తమ గ్రూప్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున సైరస్ మిస్త్రీని అంత అవమానకరంగా పదవి నుంచి తొలగించడమే తప్పనే అభిప్రాయం ఇప్పుడు గట్టిగా వినబడుతోంది. 

మిస్త్రీ వలన టాటా గ్రూప్ కి కలిగిన ఆర్ధిక, ఇతర నష్టాలకంటే, ఆయన్ని పదవిలో నుంచి తప్పించిన తరువాత టాటా సంస్థపై, మళ్ళీ సంస్థ చైర్మన్ గా నియమితులైన రతన్ టాటాపై అయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, అదేవిధంగా ఆయనపై టాటా గ్రూప్ చేసిన ప్రతివిమర్శలు, ప్రత్యారోపణల వలననే టాటా గ్రూప్ కి ఎక్కువ నష్టం కలుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మిస్త్రీ తొలగింపుకి ఎంత బలమైన కారణాలున్నప్పటికీ ఆయనని అంత హటాత్తుగా, అవమానకరంగా తొలగించడం తప్పని, రాజీనామా కోరి ఉండి ఉంటే ఆయనకి, సంస్థకి కూడా చాలా గౌరవప్రదంగా ఉండేది. దాని వలన ఇరువురికి ఇంత ఆర్ధిక, పరువు నష్టం జరిగి ఉండేది కాదని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 

ముఖ్యంగా ఏడాదిలో అతిపెద్ద ముఖ్యమైన ఈ పండుగ సీజన్ లో దేశంలోని అన్ని చిన్నాపెద్దా సంస్థలు లాభాలని ఆర్జించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తాయి. కానీ సమయం కాని సమయంలో టాటా గ్రూప్ తీసుకొన్న ఈ నిర్ణయం వలన ఇంతవరకు అది సుమారు రూ. 12,000 కోట్లు నష్టపోవడమే కాకుండా, ఇంకా నష్టాలు మూట గట్టుకంటూనే ఉంది. అది సరిపోదన్నట్లు టాటా గ్రూప్ లో రాజినామాలు కూడా మొదలవడంతో దాని పరువు ప్రతిష్టలకి కూడా భంగం వాటిల్లుతోంది. తప్పో ఒప్పో టాటా గ్రూప్ ఒక నిర్ణయం తీసేసుకొంది కనుక దాని వలన తమ సంస్థలకి జరుగుతున్న ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి వీలైనంత త్వరగా నష్ట నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. 



Related Post