సోషల్ మీడియా దెబ్బకి చైనా విలవిల

October 28, 2016


img

భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో పాకిస్తాన్ని వెనకేసుకొని వచ్చినందుకు భారతీయులు చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో చైనా వస్తువులని బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఆ దెబ్బకి ఈసారి చైనాలో తయారైన దీపావళి పటాసులు, డెకరేషన్ లైట్లు, ఇతర సామాగ్రి అమ్మకాలు దాదాపు 30శాతం వరకు పడిపోయాయని వాటిని అమ్మే వ్యాపారులు చెపుతున్నారు. అవి మాత్రమే కాకుండా దేశాన్ని ముంచెత్తున్న చైనా వస్తువుల అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని చెపుతున్నారు. భారత ప్రభుత్వం చైనా వస్తువులపై ఎటువంటి నిషేధం విదించనప్పటికీ చైనా వస్తువులని బహిష్కరించమని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వలన చాలా నష్టం జరిగినట్లు చైనా ప్రకటన స్పష్టం చేస్తోంది. 

డిల్లీలోని చైనా దౌత్యకార్యాలయం నుంచి వెలువడిన ఒక తాజా ప్రకటనలో, చైనా వస్తువులని బహిష్కరించాలనే ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బహిష్కరణ వలన చైనా పెద్దగా నష్టపోదని కానీ దాని వలన ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, భారత్ లో చైనా కంపెనీల పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 

అంటే చైనా వస్తువులని బహిష్కరిస్తే తమకేమీ నష్టం లేదని వాదిస్తూనే, మళ్ళీ వాటిని బహిష్కరించే మాటయితే భారత్ లో తమ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టబోరని బెదిరిస్తోంది. ఈ బహిష్కరణ వలన చైనాకి చాలా నష్టం జరుగుతోందని అందుకే అది చాలా ఆందోళన చెందుతోందని అర్ధం అవుతోంది. 

ప్రపంచంలో కెల్లా భారత్ అతిపెద్ద మార్కెట్ అని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గ్రహించాయి. అందుకే అన్నీ ఇప్పుడు భారత్ కి క్యూ కడుతున్నాయి. ఒకవేళ చైనా పారిశ్రామికవేత్తలు భారత్ లో పెట్టుబడులు పెట్టకపోయినా, వారి ఉత్పత్తులు భారత్ లో బహిష్కరణకి గురైన వారే నష్టపోతారు తప్ప భారత్ కాదు. కానీ తమ వస్తువులని బహిష్కరిస్తే వాటిని అమ్ముకొంటున్న భారతీయ వ్యాపారులే నష్టపోతారు తప్ప తమకి పెద్దగా నష్టం ఉండదని ఆ ప్రకటనలో చెప్పడం కూడా అతితెలివి ప్రదర్శించడమే. ఒకవేళ చైనా వస్తువులు అందుబాటులో లేకపోతే వాటి స్థానంలో భారత్ లో తయారైన వస్తువులనే అమ్ముకొంటారు. దాని వలన దేశంలో డబ్బు దేశంలోనే ఉంటుంది. దేశంలో పరిశ్రమలే లాభపడతాయి. 

భారత్ ని చైనా వస్తువులతో ముంచెత్తడం వలన అనేక భారతీయ పరిశ్రమలు చాలా తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా విద్యుత్, గృహోపకరణాలు వస్తువులని తయారు చేసే సంస్థలు చాలా నష్టపోయాయి. చైనా ఉత్పత్తుల వలన భారతీయ కుటీర పరిశ్రమలు కూడా దెబ్బ తింటున్నాయి. ఒకపక్క భారత్ పరిశ్రమలని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తునే, ఏటా కొన్ని వేల కోట్లు చైనా మూటగట్టుకొని తీసుకువెళ్ళిపోతోంది. 

కనీసం ఆ కృతజ్ఞతతో అయినా భారత్ కి అండగా నిలబడకుండా పాకిస్తాన్ కి అండగా నిలిచి దానికి అత్యాధునిక యుద్ద విమానాలు మొదలు అణుబాంబులు వరకు సరఫరా చేస్తోంది. వాటినే భారత్ పై ప్రయోగిస్తామని పాక్ సైన్యాధికారులు, ఉగ్రవాదులు బెదిరిస్తున్నారు. 

ఈవిధంగా భారత్ తో వ్యాపారం చేసుకొంటూ పాకిస్తాన్ కి సహాయపడుతున్న చైనా తయారు చేస్తున్న వస్తువులు కొనడం అవసరమా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కనుక భారత్ ని ప్రేమించేవారందరూ చైనా వస్తువులని కొనడం మానుకొంటున్నారు. మీరు కూడా వారిలో ఒకరిగా ఉండాలనుకొంటున్నారా? అయితే ఇక నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులే కొనండి. భారతీయ పరిశ్రమలని, రైతులకి తోడ్పండి.


Related Post