జానారెడ్డిగారు మీకిది తగునా?

October 26, 2016


img

కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి తన రాజకీయ ప్రత్యర్దులని కూడా నొప్పించకుండా చాలా ఆచితూచి మాట్లాడుతారని పేరున్నవారు. కానీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి చాలా చులకనగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణా ప్రజల ఆకాంక్షని గౌరవించి సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చారు తప్ప కెసిఆర్ చేసిన ఉద్యమాల చూసి కాదు. ఆయన చేసిన ఉద్యమాలు పాకిస్తాన్ తో చేసిన యుద్దాల కంటే గొప్పవా..వాటిని చూసి సోనియా గాంధీ భయపడిపోవడానికి? కేవలం సోనియా గాంధీ దయ వలనే తెలంగాణా ఏర్పడింది,” అని జానారెడ్డి అన్నారు. 

‘తెలంగాణా ఎవరి వలన వచ్చింది?’ అనే దానిపై ఎవరి వాదనలు వారికున్నాయి. కానీ కెసిఆర్ నేతృత్వంలో పదేళ్ళపాటు సుదీర్గంగా సాగిన ఉద్యమాల ఒత్తిడి వలననే యూపియే ప్రభుత్వం తెలంగాణా ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని చెప్పకతప్పదు. ఒకవేళ కెసిఆర్ తనకెందుకీ ఉద్యమాలు అనుకొని ఉండి ఉంటే ఎవరూ చొరవ తీసుకొనేవారే కాదు..అంత ఉదృతంగా ఉద్యమాలు జరిగి ఉండేవేకావని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక తెలంగాణా ఇచ్చింది సోనియా గాంధీయే అయినప్పటికీ, ఆమెకి ఆ అనివార్య పరిస్థితులు కల్పించి ఒప్పించిన ఘనత తప్పకుండా కెసిఆర్ కే దక్కుతుంది. తెలంగాణాలో ప్రజలందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. 

ఆయన ఉద్యమాలు, ముఖ్యంగా యువత బలిదానాలు కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచడంతో తెలంగాణా ఇవ్వడం మినహా మరో మార్గం లేకపోయింది. కనుక తెలంగాణా ప్రజల ఆకాంక్షలని గుర్తించి, గౌరవించి రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు జానారెడ్డి చెప్పడం చాలా తప్పు. అదే నిజమైతే, సుమారు 1200 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొనే వరకు సోనియా గాంధీ ఎందుకు రాజకీయాలు చేశారు? తెలంగాణా ప్రజల ఉద్యమాలని చాలా చులకనగా భావించినందునే కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు ఉద్యమాలు సాగినా పట్టించుకోలేదు. 

చివరికి తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని రాజకీయాలు చేసిందో అందరికీ తెలుసు. రాష్ట్రంలో తనకి ఎదురు ఉండకూడదనే ఉద్దేశ్యంతో తెరాసని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని షరతు పెట్టడం, హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆలోచన చేయడం, భిన్న సంస్కృతి గల రాయలసీమని తెలంగాణాలో చేర్చి రాయలతెలంగాణా రాష్ట్రంగా ఏర్పాటు చేసి, తద్వారా కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం సహాయంతో రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని ఆలోచించడం వంటివన్నీ కూడా అది ఎంత కుత్సితకంగా ఆలోచించిదో తెలియజేస్తున్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, తప్పనిసరి పరిస్థితులలోనే తెలంగాణా ఏర్పాటుకి అంగీకరించింది తప్ప తెలంగాణా ప్రజల ఆకాంక్షలని గౌరవించి మాత్రం కాదని చెప్పవచ్చు. 

ఒకవేళ దాని స్థానంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండి ఉంటే తెలంగాణా ఏర్పాటుకి అన్నేళ్ళు పట్టేదే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తెలంగాణా ఏర్పడింది కనుక దాని క్రెడిట్ ని అది క్లెయిం చేసుకొనే ప్రయత్నాలు చేసుకోవడానికి వీలుకలిగింది తప్ప నిజంగా అది మనస్పూర్తిగా ఇచ్చిందని చెప్పడానికి లేదు. తెలంగాణా ఉద్యమాలని పాకిస్తాన్ తో చేసిన యుద్ధంతో పోల్చడం, సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణా వచ్చిందని చెప్పడం గమనిస్తే కాంగ్రెస్ నేతలకి తెలంగాణా ఉద్యమాల పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్ధం అవుతోంది. కానీ ప్రజల ఆకాంక్షలు గౌరవించి తెలంగాణా ఏర్పాటు చేశామని జానారెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post