అన్ని పార్టీలకి అవి హెచ్చరిక వంటివే!

October 14, 2016


img

పంజాబ్ లో ప్రస్తుతం భాజపా-అకాలీదళ్ కూటమి, యుపిలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నాయి.  వచ్చే ఏడాది మొదట్లో జరుగబోయే ఆ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో అధికార పార్టీలు ఓడిపోవడం ఖాయమని తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో భాజపా ఎక్కువ స్థానాలు సంపాదించుకొనే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇది భాజపాకి చాలా సంతోషకరమైన వార్తే. కనుక పూర్తి మెజారిటీ సాధించుకొని స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనేందుకు ఇంకా గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. 

యుపిలో విజయావకాశాలు బాగా ఉన్నప్పటికీ, పంజాబ్ లో అధికారం కోల్పోవచ్చనే సర్వే ఫలితాలు దానికి చాలా ఆందోళన కలిగించేవే. అయితే అక్కడ అకాలీదళ్ ప్రభుత్వంలో భాజపా భాగస్వామిగా మాత్రమే ఉంది కనుక ఆ ఓటమిని అది తేలికగానే జీర్ణించుకోగలదు. 

యూపి ఎన్నికల సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆందోళన కలిగించేవే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి జన్మస్థానం వంటి ఆ రాష్ట్రంలోనే గత 27 ఏళ్ళుగా అధికారానికి దూరంగా ఉంది. కనుక ఈ ఎన్నికలలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో చాలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది కానీ సర్వే ఫలితాలు మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అది కేవలం 12 సీట్లకి మించి గెలుచుకోలేదని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కనుక అది వీలైనంత త్వరగా యూపిలో బలమైన భాగస్వామిని వెతుక్కోవలసి ఉంటుంది. ఈ ఎన్నికలలో అధికార సమాజ్ వాదీ పార్టీ కూడా ఓడిపోయే అవకాశం ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుశః ఈ సంగతి ముందే గ్రహించినందునే కాంగ్రెస్ తో పొత్తుల కోసం ఆసక్తి కనబరుస్తున్నారేమో? కనుక ఆ రెండు పార్టీలు జతకట్టే అవకాశం ఉందని భావించవచ్చు. అయినా వాటి విజయావకాశాలు మెరుగుపడతాయా లేదా అనే విషయం మున్ముందు తెలుస్తుంది. 

ఒకవేళ యూపిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, భాజపా అధికారంలోకి వచ్చినట్లయితే, ఆ ప్రభావం 2019 లోక్ సభ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంటుంది కనుక కేంద్రంలో కూడా అది మళ్ళీ భాజపా చేతిలో ఓటమి పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇక యూపిలో అయితే కాంగ్రెస్ పార్టీకి శాస్వితంగా తలుపులు మూసుకుపోయినట్లే భావించవచ్చు.

 కాంగ్రెస్ పార్టీ యూపిలో వెనుకబడిపోయినా పంజాబ్ లో విజయావకాశాలు ఉన్నాయనే సర్వే నివేదిక దానికి కొంత ఉపశమనం కల్పించవచ్చు. ఏమైనప్పటికీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీల ఈ బలాబలాలలో, ప్రజాభిప్రాయంలో కూడా చాలా మార్పులు రావచ్చు కానీ ఈ సర్వే ఫలితాలు అన్ని పార్టీలకి ఒక గట్టి హెచ్చరిక వంటివేనని చెప్పవచ్చు. 


Related Post